పంచాయతీ గ్రాంట్ల కింద రూ.969 కోట్లు 

2 Dec, 2021 05:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో పంచాయతీ గ్రాంట్ల కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,939 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.969 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ సహాయమంత్రి కె.ఎం.పాటిల్‌ చెప్పారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. గత ఆర్థిక సంవత్సరంలో పంచాయతీ గ్రాంట్ల కింద ఏపీకి కేటాయించిన రూ.2,625 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు. 

వరద సాయంగా రూ.895 కోట్లు ముందే ఇచ్చాం 
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వలన సంభవించిన పంట, ఆస్తి నష్టానికి సంబంధించి రూ.895 కోట్లను రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) నిధికి కేంద్ర ప్రభుత్వ వాటాగా ముందస్తుగానే విడుదల చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌రాయ్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. గత నవంబర్‌లో సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా పెద్ద ఎత్తున పంట, ఆస్తి నష్టం జరిగినట్లుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపిందని చెప్పారు.

ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు సంభవించినపుడు బాధితులకు తక్షణ సాయం, పునరావాసం కల్పించేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి నిధులను వినియోగించేందుకు వీలుగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీకి కేటాయించిన రూ.1,192.80 కోట్లలో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.895.20 కోట్లను రెండు వాయిదాలుగా విడుదల చేసినట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో  కేంద్ర బృందం పర్యటించి పరిస్థితి తీవ్రతను అంచనా వేసిన అనంతరం అవసరమైతే జాతీయ విపత్తుల ప్రతిస్పందన నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) నుంచి అదనపు సహాయం అందుతుందన్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను సహాయ చర్యలకు మాత్రమే వినియోగించాలి తప్ప నష్టపరిహారం చెల్లించడానికి కాదని స్పష్టంచేశారు. 

దిశ బిల్లులు న్యాయశాఖకు.. 
ఆంధ్రప్రదేశ్‌ దిశ బిల్లు – క్రిమినల్‌ లా (ఆంధ్రప్రదేశ్‌ సవరణ) బిల్లు–2019, ఆంధ్రప్రదేశ్‌ దిశ (మహిళలు మరియు పిల్లలపై నిర్దిష్ట నేరాలకు సంబంధించిన ప్రత్యేక న్యాయస్థానాలు) బిల్లు–2020 రాష్ట్రపతి పరిశీలన, ఆమోదం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి స్వీకరించామని వైఎస్సార్‌సీపీ ఎంపీ పరిమళ్‌ నత్వానీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌కుమార్‌ మిశ్రా తెలిపారు.

ఈ బిల్లులపై వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. ఈ రెండు బిల్లులపై మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ తమ అభిప్రాయాలు, వ్యాఖ్యలను తెలిపిందన్నారు. అనంతరం ఈ బిల్లులను న్యాయశాఖకు పంపామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ దిశ బిల్లు – క్రిమినల్‌ లా (ఆంధ్రప్రదేశ్‌ సవరణ) బిల్లు–2019కి సంబంధించి కేంద్ర హోంశాఖ మహిళా భద్రతా విభాగం వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.  

మరిన్ని వార్తలు