సచివాలయాల్లోనే ఆధార్, పాన్‌ కార్డు సేవలు

6 Aug, 2021 04:21 IST|Sakshi
గ్రామ, వార్డు సచివాలయాలపై సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స తదితరులు

ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు 

ఇక నుంచి నెలకు రెండుసార్లు మంత్రులు సచివాలయాల సందర్శన 

డిపార్ట్‌మెంట్‌ పరీక్షలపై అపోహలొద్దు 

మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స వెల్లడి 

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తోందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆధార్, పాన్‌ కార్డ్‌ లాంటి సేవలు అందించనున్నట్టు చెప్పారు. విజయవాడలో గురువారం గ్రామ, వార్డు సచివాలయాలపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. సచివాలయ సేవలను మరింత విస్తరించడం, ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. వలంటీర్, సచివాలయ వ్యవస్థలు సీఎం వైఎస్‌ జగన్‌ మానసపుత్రికలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆలోచనల నుంచి పుట్టిన ఈ వ్యవస్థల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందించగలుగుతున్నామన్నారు. ప్రతి నెలా చివరి శుక్ర, శనివారాల్లో సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటినీ సందర్శిస్తారన్నారు. ప్రభుత్వ పథకాలతో కూడిన కరపత్రాలను సచివాలయ సిబ్బంది, వలంటీర్లు తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి అందిస్తారని చెప్పారు. ఎవరికైనా ప్రభుత్వ పథకాలు అందకపోతే.. అర్హులను గుర్తిస్తారని వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చే ఫిర్యాదుల్లో పరిష్కారమైనవి, తిరస్కరించినవి వేర్వేరుగా చూపాలని అధికారులకు సూచించామన్నారు. సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, సబ్‌ కలెక్టర్లను ఆదేశించారని గుర్తు చేశారు. ఇకపై నెలకు రెండుసార్లు మంత్రులం కూడా సందర్శిస్తామని చెప్పారు. సీఎం జగన్‌ గ్రామ స్థాయి పర్యటనలు ప్రారంభించేలోపు సచివాలయాలన్నింటినీ పూర్తిగా సిద్ధం చేస్తామన్నారు. వాటి పనితీరును మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

ఏపీపీఎస్సీ ద్వారా డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు 
ప్రొబేషన్‌ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను కొంతమంది తప్పుదారి పట్టిస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొబేషన్‌ విషయంలో ఎటువంటి రాజకీయాలు ఉండవన్నారు. ఉద్యోగులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కోరారు. ఆగస్టులో, సెప్టెంబర్‌లో  డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 35 శాతం మందికి పరీక్షలు పూర్తయ్యాయన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక సీఎస్‌ అజయ్‌ జైన్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు