రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్‌ మొబైల్‌ క్యాంపులు

11 Nov, 2022 04:25 IST|Sakshi

ఈ నెల మూడో వారంలో పాఠశాలలు, సచివాలయాలు కేంద్రంగా నిర్వహణ 

నూరుశాతం ఆధార్‌కు బయోమెట్రిక్‌ చేయడమే లక్ష్యం 

సాక్షి, అమరావతి: ఆధార్‌కు బయోమెట్రిక్‌ నమోదు ప్రక్రియ నూరు శాతం పూర్తి చేసేందుకు ఈ నెల మూడో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్‌ మొబైల్‌ క్యాంపులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు, గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా డిజిటల్‌ అసిస్టెంట్‌ ద్వారా ఈ క్యాంపులను నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో కోటి మంది ఆధార్‌కు బయోమెట్రిక్‌ నమోదు కాలేదని, డిసెంబర్‌ నెలాఖరులోపు వారందరి బయోమెట్రిక్‌ను సేకరించాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 1,950 ఆధార్‌ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా డిసెంబర్‌ నెలాఖరుకు నూరు శాతం ఆధార్‌కు బయోమెట్రిక్‌ సేకరించడం సాధ్యం కాదని, పాఠశాలలు, గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా మొబైల్‌ క్యాంపులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆధార్‌ మొబైల్‌ క్యాంపుల సమాచారాన్ని ముందుగా వలంటీర్ల ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు తెలియజేయాలని సూచించింది. విద్యా శాఖ భాగస్వామ్యంతో పాఠశాలల పిల్లల ఆధార్‌ బయోమెట్రిక్‌ను సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రత్యేక క్యాంపుల్లో భాగంగా ఒక్కో కేంద్రం ద్వారా కనీసం 200 బయోమెట్రిక్‌ను సేకరించాలని స్పష్టం చేసింది.

ప్రత్యేక క్యాంపుల నిర్వహణ, పర్యవేక్షణకు మండల, డివిజన్‌ వారీగా అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించాలని తెలిపింది. పాఠశాలలు, సచివాలయాల్లో రోజు వారీగా ఆధార్‌ బయోమెట్రిక్‌ మ్యాపింగ్‌ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్లకు సూచించింది. 

మరిన్ని వార్తలు