పదేళ్లకోసారైనా ఆధార్‌ అప్‌డేట్‌!

12 Oct, 2022 04:05 IST|Sakshi

ప్రభుత్వాలందించే సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

సాక్షి, అమరావతి: మీరు ఆధార్‌ తీసుకొని పదేళ్లు పైనే అయ్యిందా? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆధార్‌ కార్డులో మీ వివరాలను అప్‌డేట్‌ చేసుకోలేదా? అయితే, వీలైనంత త్వరగా ఆధార్‌ కార్డులో మీ తాజా ఫొటో, అడ్రస్‌ తదితర వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని ఆధార్‌ కార్డుల జారీ సంస్థ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) సూచిస్తోంది. ఇందుకు గాను ఆధార్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ‘అప్‌డేట్‌ డాక్యుమెంట్‌’ పేరుతో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

ప్రభుత్వాలు ఇప్పుడు ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నా.. లబ్ధిదారుల ఎంపికకు ఆధార్‌ను కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. మరోవైపు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోకపోతే లావాదేవీలను నిలిపివేసే అవకాశముందంటూ వివిధ బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం నాటి మన ఫొటోతో పాటు ప్రస్తుత చిరునామా.. ఆధార్‌లోని చిరునామా సరిపోలక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆధార్‌ ఆధారంగా కొనసాగుతున్న సేవలకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆధార్‌ పోర్టల్‌లో ‘అప్‌డేట్‌ డాక్యుమెంట్‌’ ద్వారా ఫొటో, ఇతర వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని యూఐడీఏఐ సూచిస్తోంది. ఈ మేరకు ప్రజలకు అవగాహన కలిగించి.. వివరాలు అప్‌డేట్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని యూఐడీఏఐ హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయ డిప్యూటీ డైరక్టర్‌ జనరల్‌ పి.సంగీత ఇటీవల ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, అండమాన్‌ నికోబార్‌ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు.  

రాష్ట్రంలో సచివాలయాల ద్వారా.. 
రాష్ట్రంలోని వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు దీనిపై అవగాహన కలిగిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్న ఆధార్‌ సేవల ద్వారా వీలైనంత త్వరగా అందరి ఆధార్‌ కార్డులను అప్‌డేట్‌ చేయించేందుకు చర్యలు చేపట్టారు. ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్ల ద్వారా సచివాలయాల సిబ్బందికి, వలంటీర్లకు దీని గురించి సమాచారమిచ్చారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,950 సచివాలయాల్లో ఆధార్‌ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వలంటీర్లు తమ పరిధిలోని అన్ని కుటుంబాలకు అవగాహన కల్పించడంతో పాటు ఆధార్‌ కార్డులలో వారి వివరాలు అప్‌డేట్‌ చేసేందుకు సహకరించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యాలయం ఆదేశించింది. 

మరిన్ని వార్తలు