ఖైదీలకూ ఆరోగ్యశ్రీ! ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం

9 Aug, 2022 03:55 IST|Sakshi

మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

ఈ తరహా వైద్య సదుపాయం దేశంలోనే ప్రథమం 

జైళ్లలో మరణాలు తగ్గేందుకు దోహదం

సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఉచిత వైద్యం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మానవతా దృక్పథంతో ఖైదీలకు సైతం చికిత్స అందించనుంది. ఈ మేరకు ఖైదీలకు కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తూ తాజాగా జీవో విడుదల చేసింది. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తొలిసారి ఖైదీలకూ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలందించనుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు.. ప్రైవేటు/కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ వీరికి వైద్యం అందించనుంది.

2019 డిసెంబర్‌లో జరిగిన ప్రిజన్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఖైదీల వైద్య సదుపాయాలపై నివేదిక సమర్పించాలని జైళ్ల శాఖను ఆదేశించారు. దీంతో స్వతహాగా వైద్యుడైన జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాసరావుతో పాటు అప్పటి గుంటూరు జిల్లా జైలు సూపరింటెండెంట్‌ కె.రఘు, డీజీ అషాన్‌రెజా ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ నివేదికను ఆమోదిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జూలై 22న జీవో విడుదల చేసింది. దీంతో ఇకపై రాష్ట్రంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు అనారోగ్యం పాలైతే వారు సాధారణ ప్రజల మాదిరిగానే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు పొందొచ్చు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంబంధిత జబ్బుకు చికిత్స లభించకపోతే ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తారు. వీరి కోసం ఇప్పటికే ఆరోగ్యశ్రీ సీఈవో నెట్‌వర్క్‌ ఆస్పత్రులను గుర్తించారు. ఖైదీలు వైద్య సేవలు పొందడానికి ఆధార్‌/రేషన్‌ కార్డు ఉంటే సరిపోతుంది. అవి లేని ఇతర రాష్ట్రాల ఖైదీలకు చీఫ్‌ మినిస్టర్‌ క్యాంప్‌ ఆఫీస్‌ (సీఎంసీవో) కార్డును తాత్కాలికంగా జారీ చేస్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జైళ్లలో శిక్ష అనుభవిస్తూ సరైన వైద్యం అందక మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గనుంది.

ఇబ్బందులకు చెక్‌..
గతంలో ఎవరైనా ఖైదీకి అనారోగ్యం చేస్తే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లేవారు. అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేక ఇబ్బంది పడేవారు. వ్యా«ధి తీవ్రతను బట్టి దూరంగా ఉండే ప్రభుత్వాస్పత్రులకు ఖైదీలను రిఫర్‌ చేసేవారు. ఇందుకోసం న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ పూర్తయి ఆస్పత్రులకు వెళ్లినా ఆరోగ్యశ్రీ ఉండేది కాదు. దీంతో వైద్యం అందక ఖైదీలు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించడంతో ఖైదీలకు కూడా మెరుగైన వైద్యం అందనుంది.

జైళ్లలో మరణాలు గణనీయంగా తగ్గుతాయి..
ఖైదీలకు మెరుగైన వైద్యసేవలను ప్రభుత్వం అందిస్తోంది. ఇటువంటి సదుపాయం కల్పించిన ఘనత దేశంలో మొట్టమొదట రాష్ట్రానికే దక్కుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో జైళ్లలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. 
– డాక్టర్‌ శ్రీనివాసరావు, ఐజీ, జైళ్ల శాఖ 

మరిన్ని వార్తలు