ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలకు పెంపు: సీఎం వైఎస్‌ జగన్‌

26 Nov, 2021 03:58 IST|Sakshi

ప్రాణం విలువ తెలుసు.. అందుకే రెండున్నరేళ్లలో వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా అడుగులు

ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలకు పెంపు.. 90 శాతం మందికి వర్తింపు

పొరుగు రాష్ట్రాల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలు పొందే అవకాశం

ప్రొసీజర్లు (వ్యాధులు) 1,059 నుంచి 2,446కు పెంపు

రూ.16 వేల కోట్లతో వైద్య రంగం రూపురేఖలు మారుస్తున్నాం

ఇప్పటికే 15వేల ఏఎన్‌ఎంలు, 9,712 మంది వైద్యులు, సిబ్బందిపోస్టుల భర్తీ.. ఫిబ్రవరిలోగా మరో 14 వేలకు పైగా భర్తీ

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో గ్రామీణులకు వైద్యం చేరువ

చిన్నారులు, అవ్వాతాతలకు కంటి పరీక్షలు.. శస్త్ర చికిత్సలు

సాక్షి, అమరావతి: ‘మనిషి ప్రాణానికి విలువ ఇచ్చే ప్రభుత్వం ఇది. ప్రతి ఒక్క ప్రాణాన్ని నిలబెట్టేందుకు.. వైద్యాన్ని పేద వారికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ రెండున్నరేళ్లలో మనసా, వాచా, కర్మణ చిత్తశుద్ధితో ప్రతి అడుగు  విప్లవాత్మక మార్పులతో ముందుకేశాం’ అని సీఎం వైఎస్‌ జగన్‌ ఉద్ఘాటించారు. గురువారం శాసనసభలో ఆరోగ్య రంగంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

రెండున్నరేళ్ల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉన్నాయి? అన్నది బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి రెండున్నరేళ్ల క్రితం వర్తించే వార్షిక ఆదాయ పరిమితిని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ.5 లక్షలకు పెంచామని చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలో 90 శాతం మందికి ఆరోగ్యశ్రీ ద్వారా రక్షణ లభిస్తోందన్నారు.

రాష్ట్రంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు పెద్దగా లేవన్న సంగతి తెలిసీ కూడా, గతంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్పత్రుల్లో చికిత్సకు అనుమతించే వారు కాదని చెప్పారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తున్నామని,  హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 130 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

ఖర్చుకు వెరవక ముందుకు అడుగులు
గతంలో ఆరోగ్యశ్రీని ఎలా కత్తిరించాలి.. అని చూసే వారు. క్యాన్సర్‌కు ఒకటి రెండు సార్లు మాత్రమే కీమోథెరపీ చేసే వారు. ఇప్పుడు రూ.2.5 లక్షలు, రూ.3 లక్షలు కాదు, ఏకంగా రూ.5 లక్షలు దాటినా వ్యాధి నయమయ్యే వరకు ఏడెనిమిది సార్లు కిమోథెరపీ ఇచ్చి ఆరోగ్యశ్రీ పరిధిలో చికిత్స అందిస్తున్నాం. రూ.10 లక్షలు ఖర్చయ్యే బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను చేయిస్తున్నాం. మూగ, చెముడు పిల్లలకు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ చేయిస్తున్నాం. దీనికోసం రూ.12 లక్షలు ఖర్చు చేస్తున్నాం. 

 • రూ.11 లక్షల వ్యయమయ్యే హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. స్టెమ్‌ సెల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌.. 2 మోడల్స్‌ ఆపరేషన్లను ఆరోగ్య శ్రీ కిందకు తీసుకు వచ్చాం. ఒకదానికి రూ.6.3 లక్షలు, ఇంకోదానికి రూ.9.3 లక్షల ఖర్చు అవుతోంది. 
 • 29 నెలల్లో ఆరోగ్యశ్రీ పథకం కోసం రూ.4 వేల కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బకాయిపడిన రూ.680 కోట్లను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెల్లించాం. ఇప్పుడు.. 21 రోజులు దాటితే చాలు.. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించే విధంగా దిశా నిర్దేశం చేస్తున్నా. 
 • వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే చాలు.. వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ అండగా ఉంటుంది. గతంలో 1,059 ప్రొసీజర్లు (వ్యాధులు) మాత్రమే ఉంటే.. ఇప్పుడు 2,446 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీని విస్తరింపచేశాం. ఇంకా అవసరమైనవి చేర్చడానికి సిద్ధంగా ఉన్నాం.  

కొత్తగా 16 వైద్య కళాశాలల ఏర్పాటు 

 • ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు కేవలం 11 మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితిలో కొత్తగా 16 వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టాం. వీటికి అనుబంధంగా నర్సింగ్‌ కళాశాల, 500 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నాం.
 • గిరిజనుల కోసం పాడేరులో కొత్తగా ఒక వైద్య కళాశాల నిర్మాణాన్ని చేపట్టాం. ఐటీడీఏ ప్రాంతాల్లో మరో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. 
 • 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, 560 అర్బన్‌ హెల్త్‌క్లినిక్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. 1,325 పీహెచ్‌సీలు, 52 ఏరియా ఆసుపత్రులు(ఏహెచ్‌), 191 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్ల(సీహెచ్‌సీ) రూపు రేఖలను నాడు–నేడు ద్వారా మార్చేస్తున్నాం. సరిపడా వైద్యులు, వైద్య సిబ్బందిని నియమిస్తున్నాం. వీటన్నింటికీ రూ.16,250 కోట్లు ఖర్చు చేస్తున్నాం. డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలు ఉన్న 67 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. 
 • రెండున్నరేళ్లలో వైద్య శాఖలో 9,712 పోస్టులు భర్తీ చేశాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో 15 వేల మంది ఏఎన్‌ఎంలను నియమించాం. మరో 14,788 పోస్టులు ఫిబ్రవరిలోగా భర్తీ చేస్తున్నాం. మొత్తంగా ఒక్క వైద్య రంగంలోనే దాదాపు 40 వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.
 • ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో విప్లవాత్మక మార్పు తీసుకువస్తాం. హెల్త్‌ క్లినిక్‌లలో ఏఎన్‌ఎంలు, మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రాక్టీషనర్లు(ఎంఎల్‌హెచ్‌పీ) ఉంటారు. ఆశా వర్కర్లు అక్కడే రిపోర్టు చేస్తారు. వీళ్లందరినీ పీహెచ్‌సీలలో ఉన్న డాక్టర్లతో అనుసంధానం చేస్తున్నాం. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీకి ఒక 104 వాహనం ఉంటుంది. ఒక డాక్టర్‌ పీహెచ్‌సీలో, మరో డాక్టర్‌ 104లో తనకు కేటాయించిన నాలుగు, ఐదు గ్రామాలలో తిరుగుతాడు. ఇవన్నీ 6 నెలల్లో కార్యాచరణలోకి వస్తాయి. ఇందుకోసం 104 వాహనాలను మరో 432 కొనుగోలు చేస్తున్నాం.

వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరాతో దన్ను 

 • వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ విషయంలో మరో విప్లవాత్మక మార్పు.. ఆరోగ్య ఆసరా. ఆపరేషన్‌ చేశాక.. ఆ పేషెంట్‌ ఎన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్‌ నిర్ణయిస్తే.. అన్ని రోజులు ఆ పేషెంట్‌ బయటకు వెళ్లి పనిచేసే పరిస్థితి ఉండదు. ఆ సమయంలో వారు ఇబ్బంది పడకుండా రోజుకు రూ.220 చొప్పున లేదా గరిష్టంగా నెలకు రూ.5 వేలు ఇస్తూ తోడుగా నిలబడుతున్నాం. 
 • లెప్రసీతో బాధపడుతున్న వారికి రూ.3 వేలు, పెరాలసిస్‌ రోగులకు రూ.5 వేలు, డయాలసిస్‌ చేసుకుంటున్న వారికి రూ.10 వేల వరకు పింఛన్‌ ఇచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 
 • ఇప్పటికే 66 లక్షల మంది స్కూలు పిల్లలకు పూర్తిగా కంటి పరీక్షలు చేశాం. 1.58 లక్షల మంది పిల్లలకు కంటి అద్దాలు ఇచ్చాం. 300 మంది పిల్లలకు శస్త్ర చికిత్సలు చేయించాం. 14.28 లక్షల మంది అవ్వాతాతలకూ కంటి పరీక్షలు చేశాం. 7.83 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశాం. 1.13 లక్షల మందికి శస్త్ర చికిత్సలు చేయించాం. ఇది నిరంతర ప్రక్రియ. 56.88 లక్షల మంది అవ్వాతాతలకు కంటి వెలుగు ద్వారా దన్నుగా నిలుస్తాం. 
 • పిల్లల హార్ట్‌ కేర్‌కు సంబంధించిన ఆస్పత్రి మన దగ్గర లేదని, హైదరాబాద్‌లో ఉన్న నీలోఫర్‌ ఆస్పత్రి లాంటిది మనకూ కావాలని తిరుపతిలో ఇటీవల పద్మావతి చైల్డ్‌ హార్ట్‌ సెంటర్‌ను ప్రారంభించాం. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా మూడు పీడియాట్రిక్, హార్ట్‌కు సంబంధించిన ఆసుపత్రులు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 
 • ప్రైవేట్‌ రంగంలోనూ సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నాం. రూ.100 కోట్లు పైబడి పెట్టుబడితో ఆస్పత్రులు పెట్టే వారికి భూములు ఉచితంగా ఇస్తామని చెప్పాం. వీటిలో 50 శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ పరిధిలో పేదలకు అందుబాటులోకి వస్తాయి. కొన్ని నెలల్లో ఇవి మనకు కనిపిస్తాయి.  
 • రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా వైద్య ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. దాదాపు 40 వేల పోస్టులు ఈ ఒక్క రంగంలోనే భర్తీ చేస్తుండటం మనందరి ప్రభుత్వ నిబద్ధత. రూ.16,250 కోట్లు ఖర్చు చేస్తూ ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంటం ఒక చరిత్ర. ఎంత ఖర్చు అయినా పరవాలేదు.. ఒక మనిషిని కాపాడాలనే తాపత్రయమున్న ప్రభుత్వం ఇది. ఈ దృష్ట్యా సూపర్‌ స్పెషాలిటీ సేవల కోసం పొరుగు రాష్ట్రాల్లోని 130 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తున్నాం.


 

మరిన్ని వార్తలు