పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ చర్యలు భేష్‌

26 Sep, 2022 04:33 IST|Sakshi

బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ బాక్రే

ఇంధన, ఏపీఎస్‌ఈసీఎం అధికారులతో బీఈఈ సమీక్ష 

సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్‌ ముందు వరుసలో ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ బాక్రే  ప్రశంసించారు. రాష్ట్ర ఇంధన శాఖ, ఇంధన పరిరక్షణ మిషన్‌ (ఏపీఎస్‌ఈసీఎం) అధికారులతో బాక్రే ఆదివారం వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. తొలుత ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో  పునరుత్పాదక ఇంధన రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టినట్లు అభయ్‌ బాక్రేకు వివరించారు.

రాష్ట్రంలో మొత్తం విద్యుత్‌ ఉత్పాదక సామర్థ్యం 18.8 గిగావాట్లు ఉండగా, అందులో 40 శాతం (7.5 గిగా వాట్లు) పునరుత్పాదక ఇంధన ఉత్పత్తే అని తెలిపారు. ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి ఇతర రాష్ట్రాలకు కూడా పునరుత్పాదక ఇంధనాన్ని ఎగుమతి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

అనంతరం అభయ్‌ బాక్రే మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్య రంగాలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా స్టేట్‌ డిజిగ్నేటెడ్‌ ఏజెన్సీని ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. ఏపీ, కేరళ తరహాలో అన్ని రాష్ట్రాలు ఇంధన సామర్థ్య విభాగాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు.

పర్యావరణ పరిరక్షణ, ఇంధన సామర్థ్యం తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఏపీఎస్‌ఈసీఎం అధికారులకు బాక్రే సూచించారు. ఈ సమావేశంలో ఏపీఎస్‌ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి, ఇంధన శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు