ఇదీ.. చిత్తశుద్ధి అంటే

5 Dec, 2020 04:00 IST|Sakshi

గెలవగానే పింఛను మొత్తాన్ని పెంచిన సీఎం జగన్‌

ఈ 18 నెలల్లో 12.41 లక్షల కొత్త పింఛన్లు మంజూరు

బాబు హయాంలో ఎవరన్నా చనిపోతేనే కొత్త వారికి పింఛను

చంద్రబాబు హయాంలో పింఛన్ల ఖర్చు నెలకు రూ.552 కోట్లు

జగన్‌ సీఎం అయ్యాక పింఛన్లకు ప్రతి నెల రూ. 1,500 కోట్లు

సాక్షి, అమరావతి: బహుశా! చిత్తశుద్ధి అంటే అర్థం చంద్రబాబుకు తెలియదేమో!. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 12.41 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. నెలనెలా ఇచ్చే పింఛను మొత్తాన్ని రూ.2,250కి పెంచింది. 65 ఏళ్లు నిండితేనే వృద్ధాప్య పింఛను ఇస్తామన్న నిబంధనను మార్చి అర్హత వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. ఎవరన్నా చనిపోతే మాత్రమే ఆ స్థానంలో కొత్తవారికి పింఛన్లిచ్చే సంస్కృతికి స్వస్తి చెప్పి.. అర్హులెవరికైనా దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లో కొత్త పింఛను మంజూరు చేస్తూ వస్తోంది. వీటన్నిటికీ తోడు ప్రతి నెలా పింఛను డబ్బులు తీసుకోవడానికీ అవ్వాతాతలు ఎలాంటి ఇబ్బంది పడకుండా... వలంటీర్లు లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లిచ్చే కొత్త విధానం ఈ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిలువెత్తు నిదర్శనం. 

మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా?
అప్పట్లో 65 ఏళ్లు నిండితేనే వృద్ధాప్య పింఛను. పైపెచ్చు చంద్రబాబు 2014 జూన్‌లో అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో ఇస్తున్న పింఛన్లు 43.11 లక్షలు. ఆయన బాధ్యతలు స్వీకరించాక నాలుగున్నరేళ్లలో కొత్తగా ఇచ్చిన పింఛన్లు కేవలం రెండున్నర లక్షలు. అంతేతప్ప పెండింగ్‌లో ఉన్న మరో 8 లక్షల దరఖాస్తులవైపు చూడనే లేదు. కానీ ఎన్నికల ముందు డ్రామాలు అలవాటైన బాబు 2018 అక్టోబర్లో మాత్రం హడావుడిగా కొంత పెండింగ్‌ను క్లియర్‌ చేశారు. మరో 5 లక్షల మందికి ఓకే చేసి మొత్తం పింఛన్ల సంఖ్యను 50.86 లక్షలకు చేర్చారు. దీన్ని చిత్తశుద్ధి అంటారా?

2019 ఫిబ్రవరి వరకూ ఇచ్చింది వెయ్యే!!
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరపడానికి రెండు నెలల ముందు వరకు అంటే 2019 జనవరి నెలలో కూడా లబ్దిదారులకు బాబు ప్రభుత్వం చెల్లించింది వెయ్యి రూపాయలే. తాము అధికారంలోకి వస్తే పింఛను మొత్తాన్ని రూ.2,000కు పెంచుతామని అప్పటికి రెండున్నరేళ్ల ముందే జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అలా పెంచే ఉద్దేశం ఏమాత్రం లేని బాబు... ఎన్నికల్లో ఎసరు తప్పదని గ్రహించి ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు రూ.2,000 చేశారు. జగన్‌ దాన్ని రూ.3,000 వరకూ పెంచుకుంటూ వెళతామని చెప్పి... గెలిచిన వెంటనే అమలు చేసి చూపించారు. 2019 మే 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తే... జులై నుంచే ప్రభుత్వం రూ.2,250 చొప్పున పంపిణీ చేయటం మొదలెట్టింది. అందుకే... చంద్రబాబు ప్రభుత్వం 2018 అక్టోబరు నెల వరకు నెలకు రూ.552 కోట్ల చొప్పున పింఛను చెల్లిస్తే... జగన్‌ ప్రభుత్వం ఇప్పుడు ప్రతి నెలా సుమారు రూ.1,500 కోట్ల చొప్పున పంపిణీ చేస్తోంది. ఈ లెక్కలు చాలవూ ఎవరి చిత్తశుద్ధి ఏంటో తెలియడానికి? 

మరిన్ని వార్తలు