'మహోగ్ర' గోదావరి

17 Aug, 2020 02:37 IST|Sakshi
భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న గోదావరి

ధవళేశ్వరం బ్యారేజీలోకి 15.28 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

రెండో ప్రమాద హెచ్చరిక జారీ

బ్యారేజీ 175 గేట్లు ఎత్తి 15.23 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల

భద్రాచలం వద్ద 34 ఏళ్ల తర్వాత ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం

విలీన మండలాల్లో 60 గ్రామాలకు నిలిచిన రాకపోకలు.. దేవీపట్నం 

మండలంలో 36 గ్రామాలు జలదిగ్బంధం

ముంపు ప్రాంతాల ప్రజలు పునరావాస శిబిరాలకు తరలింపు

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, కాకినాడ/శ్రీశైలం ప్రాజెక్ట్‌/సాక్షి, బళ్లారి/హొసపేటె/ఆదోని: నదీ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటం.. ఉప నదులు, కొండవాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 15,28,632 క్యూసెక్కుల ప్రవాహం రావడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. డెల్టా కాలువలకు 5,500 క్యూసెక్కులను వదిలి, మిగులుగా ఉన్న 15,23,132 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. ఆదివారం రాత్రికి బ్యారేజీలోకి 17 లక్షల క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు.
నిండుకుండలా మారిన రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి  

► భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 54 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 
► 1986లో భద్రాచలం వద్ద గరిష్టంగా వరద నీటిమట్టం 55.66 అడుగులుగా నమోదైంది. మళ్లీ ఆదివారం రాత్రి 9 గంటలకు అక్కడ వరద నీటిమట్టం మరింత ప్రమాదకరంగా మారొచ్చని కేంద్ర జలసంఘం హెచ్చరించింది.
► పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద నీటిమట్టం 30 అడుగులకు చేరుకుంది. పోలవరం నుంచి ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలోని కడెమ్మ వంతెన మునిగిపోయింది. 
► పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద గోష్పాద క్షేత్రం నీటమునిగింది. 
► తూర్పు గోదావరి జిల్లాలో దేవీపట్నం మండలంలో 36 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా, వేలేరుపాడు, కుక్కునూరు, చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, ఎటపాక మండలాల్లో 60 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలో శబరి ఉధృతి కారణంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు రాకపోకలు ఆగాయి. 
► రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రాష్ట్ర, జాతీయ విపత్తు దళ బృందాలను రంగంలోకి దించి ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తోంది. 
► టి.నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం – మధ్యాహ్నపువారిగూడెం మధ్య ఎర్రకాలువ దాటుతూ ములకాల దుర్గారావు మృతి చెందాడు. 
► శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 83.471 టీఎంసీల గోదావరి జలాలు కడలిలో కలిశాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 431.021 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. 

కృష్ణా నదిలో మళ్లీ పెరిగిన వరద 
► కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు 1.31 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 42,378 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 144.80 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
► నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 249.80 టీఎంసీలకు చేరుకుంది. 
► పులిచింతలకు దిగువన మున్నేరు, కట్టలేరు, వైరా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి 1.56 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. దీంతో 70 గేట్లు ఎత్తి 1.25 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం రాత్రి బ్యారేజీలోకి వరద మరింత పెరగనుంది. తుంగభద్ర డ్యామ్‌ నుంచి మువ్వన్నెల విద్యుద్దీపాల వెలుగుల్లో జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. 

మరిన్ని వార్తలు