పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాకు రూ.2,234.28 కోట్లు

12 Dec, 2020 03:43 IST|Sakshi

శుక్రవారం జమ చేసిన ఎన్‌డబ్ల్యూడీఏ

కేంద్రం ఇంకా చెల్లించాల్సిన బకాయి రూ.1,787.88 కోట్లు

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాకు రూ.2,234.28 కోట్లు జమయ్యాయి. జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్లూడీఏ) శుక్రవారం ఆ మొత్తాన్ని జమ చేసింది. గత శుక్రవారం ఈ మొత్తాన్ని జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ)కు నాబార్డు విడుదల చేసిన విషయం తెలిసిందే.  దీంతో ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులను రీయింబర్స్‌ చేస్తూ ఈ నిధులను ఎన్‌డబ్ల్యూడీఏ విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.17,665.29 కోట్లు ఖర్చు చేసింది.

ఇందులో ఏప్రిల్‌ 1, 2014 తర్వాత రూ.12,529.42 కోట్లను ఖర్చు చేసింది. అందులో ఇప్పటివరకూ రూ.8,507.26 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రీయింబర్స్‌ చేసింది. తాజాగా ఎన్‌డబ్ల్యూడీఏ పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాకు జమ చేసిన రూ.2,234.28 కోట్లను కలుపుకుంటే.. రూ.10,741.54 కోట్లను రీయింబర్స్‌ చేసింది. అంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రూ.1787.88 కోట్లు బకాయి పడింది.  

మరిన్ని వార్తలు