బ్యాంకుల్లో 35.24 లక్షల వైఎస్సార్‌ బీమా దరఖాస్తుల పెండింగ్‌

12 May, 2021 05:13 IST|Sakshi

ఈ ఏడాదికి ఇప్పటికే 62.43 లక్షల కుటుంబాల బీమా ఎన్‌రోల్‌మెంట్‌

కొనసాగుతున్న సర్వే

పథకం అమలుపై అధికారులతో సమీక్షించిన మంత్రి పెద్దిరెడ్డి

సాక్షి, అమరావతి: అనుకోని ఆపద వచ్చి కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలు ఒక్కసారిగా రోడ్డున పడకుండా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్‌ బీమా పథకంలో పేర్ల నమోదు దరఖాస్తులు బ్యాంకుల వద్ద పెండింగ్‌లో ఉండడంపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పథకం అమలుకు సంబంధించి దాదాపు 12 బ్యాంకుల వద్ద 35.24 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. అధికారులు, బ్యాంకర్లు వాటిపై దృష్టి సారించాలని ఆదేశించారు. వైఎస్సార్‌ బీమా పథకం అమలుపై మంత్రి పెద్దిరెడ్డి మంగళవారం 13 జిల్లాల గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు, బ్యాంకర్ల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సర్వే పూర్తయి, బ్యాంకుల వద్దకు వచ్చిన దరఖాస్తులను కూడా ఎన్‌రోల్‌ చేయకపోవడం సరికాదని చెప్పారు. గత ఏడాది బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల ఎన్‌రోల్‌కాని పేదలకు కూడా బీమా మొత్తాలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానవతాదృక్పథంతో ప్రభుత్వం తరఫున చెల్లించారని గుర్తుచేశారు. దీన్నిబట్టి పేదల విషయంలో ఈ ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందో బ్యాంకర్లు అర్థం చేసుకోవాలని కోరారు. 

కొనసాగుతున్న 55.57 లక్షల కుటుంబాల ఎన్‌రోల్‌మెంట్‌ 
బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బీమాతో భరోసా కల్పించాలని సీఎం జగన్‌ ఏటా వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం తరఫున ప్రీమియంగా బ్యాంకులకు చెల్లిస్తున్నారని చెప్పారు. పథకం ప్రయోజనాలు అర్హులకు అందేందుకు అందరూ బాధ్యతగా పనిచేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 1.48 కోట్ల బియ్యం కార్డులు ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పథకం అమలుకు సంబంధించి 1.35 కోట్ల కుటుంబాల సర్వే  పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. అర్హులుగా నిర్ధారించుకున్న వారిలో.. ఇప్పటివరకు 62.43 లక్షల మంది బీమా కింద ఎన్‌రోల్‌ అయ్యారని, ఇంకా 55.57 లక్షల కుటుంబాల ఎన్‌రోల్‌ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.

సర్వే చేయని కుటుంబాలకు సర్వే ప్రక్రియ పూర్తిచేయడంతో పాటు ఎన్‌రోల్‌ ప్రక్రియ మొత్తం మరో నెలన్నర రోజుల్లో పూర్తిచేయాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో బ్యాంకు సిబ్బంది ఇబ్బందులను కూడా అర్థం చేసుకుని బ్యాంకు ఉద్యోగులందరికీ పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ వేయించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గ్రామ, వార్డు సచివాలయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, కార్మికశాఖ కమిషనర్‌ రేఖారాణి, సెర్ప్‌ íసీఈవో పి.రాజాబాబు, ఎస్‌ఎల్‌బీసీ అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు