రాష్ట్రానికి 4.77 లక్షల టీకాలు

13 Jan, 2021 03:23 IST|Sakshi
విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద కంటైనర్‌లో టీకా బాక్సులను లోడ్‌ చేస్తున్న సిబ్బంది

ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న వ్యాక్సిన్‌లు.. నేడు అన్ని జిల్లాలకు సరఫరా

సాక్షి, అమరావతి/గన్నవరం: రాష్ట్రానికి కోవిడ్‌ టీకా వచ్చేసింది. గన్నవరం విమానాశ్రయానికి కోవిడ్‌ టీకా బాక్సులు చేరుకున్నాయి. సీరం ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించిన ‘కోవిషీల్డ్‌’ వ్యాక్సిన్‌ పుణె నుంచి 4.77 లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లున్న 40 బాక్సులు ప్రత్యేక విమానంలో వచ్చాయి. వీటిని కంటైనర్‌లో బందోబస్తు మధ్య గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనానికి తరలించి వాక్‌ ఇన్‌ కూలర్స్‌లో భద్రపరిచారు. ఇక్కడి నుంచి ఈ వ్యాక్సిన్‌ను జిల్లాలకు పంపిస్తారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా నిర్ణయించిన 3.87 లక్షలమంది హెల్త్‌కేర్‌ సిబ్బందికి వ్యాక్సిన్‌ వేసే ప్రక్రియ ఈ నెల 16న ఉదయం తొమ్మిది గంటలకు అన్ని జిల్లాల్లో ప్రారంభమవుతుంది. మరో 20 వేల డోసుల వ్యాక్సిన్‌ భారత్‌ బయోటెక్‌ కంపెనీ నుంచి బుధవారం రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి.

కేంద్రం మార్గదర్శకాల మేరకే జిల్లాలకు
రాష్ట్రానికి చేరుకున్న వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే జిల్లాలకు రవాణా చేస్తారు. మంగళవారం రాత్రికి కేంద్రం నుంచి మార్గదర్శకాలు రావచ్చని అధికారులు అంచనా వేశారు. వ్యాక్సిన్‌ ఎలా తరలించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటివాటిపై కేంద్రం ప్రత్యేక మార్గదర్శకాలు ఇచ్చాకే వ్యాక్సిన్‌ సరఫరా అవుతుంది. ఒక్కొక్కరికి 0.5 మిల్లీలీటర్ల డోసును ఐఎం (ఇంట్రా మస్క్యులర్‌.. అంటే కండరాలకు వేసేది) ఇంజక్షన్‌ ద్వారా వేస్తారు. ప్రస్తుతం రాష్ట్రానికి వచ్చింది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు సంబంధించి రెండుడోసుల వ్యాక్సిన్‌ అని కుటుంబ సంక్షేమశాఖ అధికారులు తెలిపారు. అవసరం మేరకు మరికొన్ని డోసులు వస్తాయి. గన్నవరం వ్యాక్సిన్‌ నిల్వ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్‌ రవాణాకు 19 ప్రత్యేక వాహనాలను సిద్ధంగా ఉంచారు. గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాట్లను కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ యు.శ్రీహరి, ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ జి.మధుసూదనరావు పర్యవేక్షించారు.  

3.80 లక్షలమందికిపైగా ఆరోగ్యశాఖ సిబ్బందికి వ్యాక్సిన్‌
ఏర్పాట్లను సమీక్షించిన సీఎస్‌ అదిత్యనాథ్‌దాస్‌
రాష్ట్రంలో ఈ నెల 16న ప్రారంభించనున్న మొదటి విడత కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లపై మంగళవారం ఆయన విజయవాడలో తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి 4.77 లక్షల డోసుల వ్యాక్సిన్లు వచ్చిందన్నారు. ముందు 3.80 లక్షలమందికిపైగా ఆరోగ్యశాఖ సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 332 సెషన్‌ సైట్లలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో కోవిషీల్డ్‌ టీకా బాక్స్‌ను అందుకుంటున్న కలెక్టర్, జేడీ, జేసీ 

వీరికి వ్యాక్సిన్‌ వేయకూడదు..
16న జరిగే వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో గర్భిణులు, 50 ఏళ్లు నిండిన, 18 ఏళ్ల లోపు, కోమార్భిడిటీ లక్షణాలతో ఇబ్బందిపడేవారికి వ్యాక్సిన్‌ వేయరాదని సీఎస్‌ స్పష్టం చేశారు. 

రెండోవిడతలో పోలీసు సిబ్బందికి వ్యాక్సిన్‌
డీజీపీ గౌతం సవాంగ్‌ మాట్లాడుతూ ఎస్పీలు.. కలెక్టర్లను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. రెండోవిడతలో పోలీస్‌ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ చేయనున్నందున బందోబస్తు ఏర్పాట్లకు ఆటంకం లేకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌సింఘాల్‌ మాట్లాడుతూ ఈ నెల 16న ప్రారంభం కానున్న తొలివిడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి రాష్ట్రంలో 332 సెషన్‌ సైట్లు ఏర్పాటు చేయగా.. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 33 సైట్లు, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 15 సైట్లు ఉన్నట్లు చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కె.భాస్కర్‌ మాట్లాడుతూ రాష్ట్ర, ప్రాంతీయ, జిల్లా వ్యాక్సిన్‌ స్టోరేజి కేంద్రాలను సీసీటీవీల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ప్రతి గ్రామ/వార్డు సచివాలయం వద్ద ఒక సెషన్‌ సైట్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో చేయవలసిన, చేయకూడనిఅంశాలపై ఐఈసీ మెటీరియల్‌ను జిల్లాలకు పంపినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డీజీపీ రవిశంకర్, కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్, జేసీ మాధవీలత, సమాచారశాఖ కమిషనర్‌ టి.విజయకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు