ఏపీ మున్సిపల్‌ ఎన్నికలు; 59.63% పోలింగ్‌

16 Nov, 2021 02:51 IST|Sakshi

సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతోపాటు, వివిధ మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డుల్లో పోలింగ్‌ సోమవారం ముగిసింది. 325 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు నిర్వహించగా 8,62,066 మంది ఓటర్లకు గాను 5,14,086 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 59.63% పోలింగ్‌ నమోదైంది.

అనంతపురం జిల్లా పెనుకొండ మున్సిపాలిటీలో 82.63%, అత్యల్పంగా నెల్లూరు కార్పొరేషన్‌లో 52.25% పోలింగ్‌ నమోదైంది. నెల్లూరు కార్పొరేషన్‌లో 46 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా 52.25 శాతం మంది ఓటు వేశారు. కుప్పం మున్సిపాలిటీలో 24 వార్డులకు పోలింగ్‌ జరిగింది. ఇక్కడ 37,664 మంది ఓటర్లు ఉండగా 28,942 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

మందకొడిగా పోలింగ్‌
ఎన్నికల సరళి మందకొడిగా సాగింది.  ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా తొమ్మిది గంటల వరకూ కేవలం 10.12% పోలింగ్‌ నమోదైంది. 11 గంటలకు 24.96%, మ.ఒంటి గంటకు 41.02%.. 3 గంటల సమయానికి 50 శాతానికి పోలింగ్‌ జరిగింది. ఇలా మొత్తంగా 59.63% ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా విజయనగరం కార్పొరేషన్‌లో 65.04%, అత్యల్పంగా అనంతపురం కార్పొరేషన్‌లో 37.58% పోలింగ్‌ నమోదైంది. 

నగర పంచాయతీలు, పట్టణాలే మిన్న
ఓటు హక్కు వినియోగించుకోవడంలో నగరాలతో పోలిస్తే పట్టణాలు, నగర పంచాయతీ ప్రజలే చైతన్యం కనబర్చారు. నెల్లూరు కార్పొరేషన్‌లోని 46 డివిజన్లతో పాటు, వివిధ కార్పొరేషన్లలోని 10 డివిజన్లు కలిపి 56 డివిజన్లలో కేవలం 49.89% మంది మాత్రమే ఓటు వేశారు. అదే పట్టణాలు, నగర పంచాయతీల్లో 72.19% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

మరిన్ని వార్తలు