బావులు, బోర్లు వద్ద నీళ్లు బంద్‌ 

13 Aug, 2020 05:16 IST|Sakshi

అవసరమైన నీటిని నేరుగా కుళాయి ద్వారా ఇంటికే సరఫరా

వచ్చే నాలుగేళ్లలో 63.73 లక్షల ఇళ్లకు కుళాయిలు 

తొలి ఏడాది 32 లక్షల ఇళ్లకు ఏర్పాటు 

మొత్తం ఖర్చు రూ.10,975 కోట్లు 

సాక్షి, అమరావతి: బావులు, బోర్ల నుంచి నీటిని తెచ్చుకునే పరిస్థితికి ఇకపై చెల్లుచీటి పడనుంది. తాగునీటి అవసరంతో పాటు రోజు వారీ సాధారణ అవసరాలకు కావాల్సిన నీటిని గ్రామాల్లోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారానే సరఫరా చేసే విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో 95.66 లక్షల ఇళ్లు ఉంటే.. ఇందులో ఇప్పటివరకు 31.93 లక్షల ఇళ్లలో కుళాయిలున్నాయి. వీటికే ప్రస్తుతం నేరుగా నీటిని సరఫరా చేసే వీలుంది. మిగిలిన 63.73 లక్షల ఇళ్లకు వచ్చే నాలుగేళ్లలో కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు రూ.10,975 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే, ఈ ఖర్చులో సగం కేంద్రం జలజీవన్‌ మిషన్‌ కార్యక్రమం కింద భరించనుంది.   

► నాలుగేళ్ల కాల పరిమితిలో తొలి ఏడాది 32 లక్షల ఇళ్లకు కొత్తగా నీటి కుళాయిలు ఏర్పాటుచేయాలన్నది ఆర్‌డబ్ల్యూఎస్‌ లక్ష్యం. ఇందుకు రూ.4,800 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇందులో రూ.2,400 కోట్లు జలజీవన్‌ మిషన్‌ కింద నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. 
► మంచినీటి పథకం, ఓవర్‌òహెడ్‌ ట్యాంకు వంటివున్న గ్రామాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ గ్రామాల్లో తొలుత అన్ని ఇళ్లకు కుళాయిలు ఏర్పాటుచేస్తారు. ఆ తర్వాత 75 శాతం ఇళ్లకైనా నీటి సరఫరా చేసే సామర్థ్యం ఉన్న గ్రామాలకు ప్రాధాన్యతనిస్తారు.  
► తొలి ఏడాది 32 లక్షలు, రెండో ఏడాది 25 లక్షలు మూడో ఏడాది 5 లక్షలు, నాలుగో ఏడాది మిగిలిన ఇళ్లకు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.   

>
మరిన్ని వార్తలు