పనితీరు బాగుంది.. సచివాలయాలు భేష్‌..

3 Oct, 2021 03:21 IST|Sakshi

96.51 శాతం గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు బాగుంది 

95.42 శాతం వలంటీర్లు భేష్‌ 

3.22% సచివాలయాల పనితీరు సాధారణం  

4.77 శాతం వలంటీర్లు పరవాలేదు 

కలెక్టర్లు, ఇతర అధికారుల తనిఖీల్లో వెల్లడి 

సాక్షి, అమరావతి: ఉన్నతాధికారుల తనిఖీలతో గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు మరింతగా మెరుగు పడుతున్నట్టు స్పష్టమైంది. నిత్యం ప్రజలకు సమర్థవంతంగా సేవలందించడమే లక్ష్యంగా కలెక్టర్ల నుంచి మున్సిపల్‌ కమిషనర్ల వరకు తనిఖీలు తప్పనిసరి చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలు ఇస్తోంది. ఒక్కో స్థాయి అధికారి.. వారానికి ఇన్ని సచివాలయాల పనితీరును పరిశీలించాలని, ఏవైనా లోటు పాట్లు ఉంటే సరిచేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో కలెక్టర్ల నుంచి సబ్‌ కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ల వరకు ప్రతి వారం గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 23వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 19వ తేదీ వరకు సంబంధిత అధికారులు 1,352 తనిఖీలు నిర్వహించాల్సి ఉండగా, 1,462 తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో ప్రధానంగా సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల పనితీరుతో పాటు ప్రజలకు అందిస్తున్న సేవలు, ప్రభుత్వ పథకాల వివరాలు, సంక్షేమ కేలండర్‌ ప్రదర్శన వంటివి పరిశీలిస్తున్నారు. తనిఖీల్లో 96.51 శాతం సచివాలయాల పనితీరు బాగుందని, 3.22 శాతం సచివాలయాల పనితీరు సాధారణంగా ఉందని తేలింది. కేవలం 0.27 శాతం సచివాలయాల పనితీరు మాత్రమే బాగోలేదని స్పష్టమైంది. 95.42 శాతం వలంటీర్ల పనితీరు బాగుండగా, 4.17 శాతం వలంటీర్ల పనితీరు సాధారణంగా ఉందని, 0.41 శాతం వలంటీర్ల పనితీరు బాగోలేదని తేలింది. కలెక్టర్లు ప్రతివారం 2 సచివాలయాలు, జాయింట్‌ కలెక్టర్లు వారానికి 4 సచివాలయాలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్‌ కలెక్టర్లు వారానికి నాలుగు సచివాలయాలను సందర్శించాలని నిర్ధారించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు