ఐటీయే మేటి; టాప్‌ కంపెనీల్లో ప్లేస్‌మెంట్‌ కోసం 2.41 లక్షల మంది పోటీ

7 Jan, 2022 10:37 IST|Sakshi

క్యాప్‌ జెమిని, డెలాయిట్‌లో ఉద్యోగాలకు ఇప్పటికే భారీగా దరఖాస్తులు

ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్‌కూ గురి

విద్యార్థులకు తగిన శిక్షణ అందజేస్తున్న ‘అపిట’

దీంతో గతేడాది హైఎండ్‌ ఐటీలో 4,507 మందికి కొలువులు

సాక్షి, అమరావతి: ప్రధాన ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకు ఏపీ రాష్ట్ర విద్యార్థులు గురి పెట్టారు. వీరికి ఏపీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అకాడమీ(అపిట) కూడా తగిన శిక్షణ, సహకారం అందజేస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. దీంతో లక్షలాది మంది విద్యార్థులు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేస్తున్నారు. ఇప్పటికే క్యాప్‌ జెమిని కోసం 50,000 మంది, డెలాయిట్‌లో ఉద్యోగాల కోసం 18,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్‌ కంపెనీలకు సంబంధించిన నమోదు ప్రక్రియ జరుగుతున్నట్లు రాష్ట్రంలో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ వ్యవహారాలను పర్యవేక్షించే అపిట సీఈవో అనిల్‌ తెంటు తెలిపారు. 

అత్యధికంగా ఇన్ఫోసిస్‌ కంపెనీలో ఉద్యోగాల కోసం 75,000 మంది నమోదు చేసుకుంటారని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. టీసీఎస్‌ కోసం 50,000, హెచ్‌సీఎల్‌ కోసం 48,000 మంది దరఖాస్తులు దాఖలు చేసుకునే అవకాశం ఉందన్నారు. మొత్తంగా టాప్‌ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఈ ఏడాది 2.41 లక్షల మంది పోటీ పడే అవకాశముందని తెలిపారు. కాగా, గతేడాది ఐటీ హై ఎండ్‌ రంగంలో అపిట ద్వారా 4,507 మందికి ఉద్యోగాలు లభించాయి.. అందులో ఒక్క ఇన్ఫోసిస్‌ సంస్థే 4,209 మందిని తీసుకుందని పేర్కొన్నారు. 

అపిట.. ‘హైఎండ్‌’ శిక్షణ
అధిక జీతాలను అందించే హైఎండ్‌ టెక్నాలజీ కోర్సుల శిక్షణపై అపిట ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం వివిధ సంస్థలతో ఒప్పందం చేసుకొని.. నూతన టెక్నాలజీలపై విద్యార్థులకు శిక్షణ అందజేస్తోంది. ఈ ఏడాది బ్లాక్‌ చైన్, ఫుల్‌ స్టాక్‌ జావా, ఐవోటీ, 3డీ టెక్నాలజీ, డీకోడ్‌ హ్యాకథాన్‌ తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీలో కనీసం 3,000 మందికి శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం ఢిల్లీలోని కామన్‌ వెల్త్‌ ఆఫ్‌ మీడియా అండ్‌ లెర్నింగ్‌ స్టడీస్‌ అనే సంస్థతో అపిట ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కోర్సులకు శిక్షణ జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.

అలాగే నాంది ఫౌండేషన్‌ సహకారంతో ఐవోటీ, 3డీ టెక్నాలజీ.. డీకోడ్‌ హ్యాకథాన్‌పై శిక్షణ ఇచ్చేందుకు డీకోడ్‌ గ్లోబల్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఐటీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌(ఐటాప్‌) సహకారంతో ఫుల్‌స్టాక్‌ జావాపై 1,500 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. గతేడాది ఇన్ఫోసిస్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం 29,222 మంది శిక్షణ తీసుకోగా.. టీసీఎస్‌ కోసం 260 మంది శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా.. విద్యార్థులు ప్రారంభంలోనే అధిక వేతనాలు అందుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు అనిల్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు