పుష్కలంగా మందులు 

29 Apr, 2022 05:29 IST|Sakshi

రూ.2,250 కోట్లతో మందులు, సర్జికల్స్‌ కొనుగోళ్లు

గత ప్రభుత్వ బకాయిలు రూ.160 కోట్లు కూడా చెల్లింపు

వాస్తవ విరుద్ధంగా ఈనాడు కథనం

వైఎస్సార్‌సీపీ సర్కారు వచ్చాక మందుల రకాలు 229 నుంచి 480కు పెంపు

గతంలో చెల్లింపుల్లో జాప్యం.. ఫలితంగా మందుల సరఫరాపై ప్రభావం

అందుబాటులో మధుమేహం, రక్తపోటు, హృద్రోగం మందులు

ఎక్కడా యాంటీ బయోటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్‌ కొరతలేదు

ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధరరెడ్డి వెల్లడి

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల అవసరాలకు సరిపడా ఔషధాలు, వైద్య పరికరాలు సమృద్ధిగా ఉన్నాయని ఏపీ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఎండీ డి. మురళీధరరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మందులు, సర్జికల్స్‌ కోసం రూ.2,250 కోట్లు వెచ్చించిందన్నారు. దీంతోపాటు గత ప్రభుత్వ బకాయిలు రూ.160 కోట్లను సైతం చెల్లించిందన్నారు. ‘మందులు లేవాయే’ శీర్షికతో ఈనాడు పత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా వాస్తవ విరుద్ధంగా ఉందని ఆయన ఖండించారు. నవరత్నాలు, నాడు–నేడు పథకాలతో రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలను అందించడంతో పాటు వాటి బలోపేతం దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజారోగ్య రక్షణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని గురువారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.

మందుల రకాలు 480 వరకు పెంపు
రాష్ట్రంలో మే 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం కేవలం 229 రకాల మందులను మాత్రమే అందుబాటులో ఉంచేదని.. కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆ సంఖ్యను 480కు పెంచినట్లు ఆయన తెలిపారు. అప్పట్లో సరఫరాదారులకు చెల్లింపుల్లో కూడా తీవ్రజాప్యం జరిగేదని గుర్తుచేశారు. ఫలితంగా మందుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడేదన్నారు. ఇక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆస్పత్రుల్లో రోగుల అవసరాలు, డిమాండ్‌ కంటే ఆంధ్రప్రదేశ్‌ పెద్ద మొత్తంలోనే మందులు, సర్జికల్స్‌ కొనుగోలు చేస్తోందని మురళీధరరెడ్డి స్పష్టంచేశారు. ఇందులో భాగంగా 2021–22లో రూ.254 కోట్లతో కొనుగోళ్లు చేశామన్నారు. 

అవసరానికి తగ్గట్లుగా సరఫరా
ఇక మధుమేహం, రక్తపోటు, హృద్రోగం నివారణకు అవసరమైన ఔషధాలు సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌లో సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆస్పత్రుల అవసరాల మేరకు వాటిని సరఫరా చేస్తున్నట్లు మురళీధరరెడ్డి తెలిపారు. ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆస్పత్రులకు 1.93 కోట్ల పాంటాప్రజోల్‌ టాబ్లెట్లు, 2.32 కోట్ల రాంటిడిన్‌ టాబ్లెట్లను సరఫరా చేసిందని వివరించారు. అయితే.. మూడు బ్యాచ్‌ల రాంటిడిన్, ఆరు బ్యాచ్‌ల పాంటాప్రజోల్‌ టాబ్లెట్లు ప్రమాణాలకు అనుగుణంగా లేవని విజయవాడలోని డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ (డీసీఎల్‌) ప్రకటించడంతో వాటిని నిలిపివేశామన్నారు. వీటికి తాజాగా టెండర్లు పిలిచామని, వచ్చే వారంలో ఖరారు చేస్తామన్నారు.

రూ.150 కోట్లతో యాంటీ  బయోటిక్స్, ఫ్లూయిడ్స్‌ కొనుగోళ్లు
మరోవైపు.. కోవిడ్‌ వ్యాప్తి సమయంలో డిమాండ్‌ కంటే ఎక్కువగా రూ.150 కోట్ల వ్యయంతో యాంటిబయోటిక్, ఐవీ ఫ్లూయిడ్స్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన తెలిపారు. అయితే.. కోవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోవటంతో వీటిని ఆ చికిత్సకు వినియోగించామన్నారు. తర్వాత కాలంలో అవసరాల మేరకు యాంటీబయోటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్‌ కొనుగోలుకు ప్రభుత్వం ఆర్డర్‌ పెట్టిందన్నారు. ప్రస్తుతం తగిన స్థాయిలో వీటి నిల్వలున్నాయన్నారు.   

మరిన్ని వార్తలు