అల్పపీడనాలే ఆదుకున్నాయ్‌!

12 Oct, 2020 04:01 IST|Sakshi
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు (ఫైల్‌)

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు

సీజన్‌లో సాధారణం కంటే 44 శాతం అధికం 

సాక్షి, అమరావతి బ్యూరో: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో అల్పపీడనాలే ఆదుకున్నాయి. సీజన్‌ ఆరంభమైనప్పట్నుంచి ముగిసే వరకు బంగాళాఖాతంలో ఐదు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఒక్క వాయుగుండంగానీ, తుఫాన్‌గానీ ఏర్పడకుండానే సమృద్ధిగా వర్షాలు కురిశాయి. జూన్‌ మొదటి వారం నుంచి సెప్టెంబర్‌ ఆఖరు వరకు నైరుతి రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. ఈ నాలుగు నెలల్లో కనీసం రెండు వాయుగుండాలుగానీ, ఒకట్రెండు తుఫాన్‌లుగానీ వస్తుంటాయి. కానీ ఈసారి అలా జరగలేదు. అల్పపీడనాలే పుష్కలంగా వర్షాలు కురిపించి రైతులకు, రాష్ట్రానికి మేలు చేశాయి. వీటితో పాటు ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడన ద్రోణులు వంటివి మరో 12 వరకూ ఏర్పడ్డాయి. ఇవి కూడా రాష్ట్రంలో వర్షాలకు దోహదపడ్డాయి.  

కోస్తా కంటే సీమలోనే అత్యధిక వర్షపాతం 
సబ్‌ డివిజన్‌వారీగా చూస్తే కోస్తాంధ్ర కంటే ఈ సారి రాయలసీమలో అత్యధిక వర్షపాతం నమోదైంది. అక్కడ 411.6 మి.మీల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా 756.1 మి.మీల వర్షం కురిసింది. సీమలో అత్యధికంగా కడప జిల్లాలో 401.3 మి.మీలకు గాను 843.6 మి.మీలు నమోదైంది. ఇక కోస్తాంధ్ర (యానాంతో కలిపి)సబ్‌డివిజన్‌లో సాధారణ వర్షపాతం 586.9 మి.మీ కాగా, 725.3 మి.మీల వర్షం కురిసింది.  

శ్రీకాకుళం జిల్లా మినహా..  
రాష్ట్రంలో ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే లోటు వర్షపాతం నమోదైంది. అక్కడ 742.4 మి.మీలకు 558.5 మి.మీల వర్షపాతమే రికార్డయింది. నెలలవారీగా చూస్తే జూలైలో అధిక వర్షాలు కురిశాయి. ఆగస్టులో స్వల్పంగానే వానలు పడా ్డయి. జూన్‌లో 32 శాతం, జులైలో 74 శాతం, ఆగస్టులో 6 శాతం, సెప్టెంబర్‌లో 58 శాతం సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది.   

పొంగుతున్న వాగులు, వంకలు
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యా ప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.  కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు, ఓర్వకల్లు మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. వైఎస్సార్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పాపాఘ్ని నది ఉప్పొంగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని వేలేరుపాడు మండలంలో గరిష్టంగా 76.8 మి.మీ. వర్షం కురిసింది.విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా,  అనంతపురం, జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలతో వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగి ప్రవహిస్తున్నాయి. నిజాంపట్నం హార్బర్‌లో మూడో నంబర్‌ ప్రమాద హెచ్చరిక ఎగరవేశారు. కాకినాడ–ఉప్పాడ బీచ్‌ రోడ్డు పలుచోట్ల కోతకు గురైంది. ఇక్కడి జియోట్యూబ్‌ రక్షణ గోడ పూర్తిగా ధ్వంసమైంది.

కృష్ణమ్మకు మళ్లీ వరద
ఎగువన విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి శ్రీశైలానికి 38,516 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. రాత్రి 7 గంటలకు రెండు గేట్లను 10 అడుగుల మేరకు తెరిచి మొత్తం 56,058 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.  ప్రస్తుతం జలాశయంలో 215.8070 టీఎంసీల నీరు నిల్వగా ఉండగా, డ్యామ్‌ నీటిమట్టం 885 అడుగుల గరిష్ట స్థాయికి  చేరుకుంది. మరోవైపు భారీ వర్షాలతో తుంగభద్ర డ్యాంలోకి ఆదివారం దాదాపు 52 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ముందు జాగ్రత్తగా 16 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు