పాడేరు ఐటీడీఏ ఈఈపై ఏసీబీ దాడులు 

21 Nov, 2021 05:32 IST|Sakshi

మూడు ప్రాంతాల్లో తనిఖీలు 

ఆదాయానికి మించి ఆస్తులు కేసు నమోదు.. అరెస్ట్‌  

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : గిరిజన సంక్షేమ శాఖ అధికారిపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) శనివారం దాడులు నిర్వహించింది. పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ) కాట్రెడ్డి వెంకటసత్యనగేష్‌కుమార్‌పై అక్రమాస్తులపై ఫిర్యాదు రావడంతో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలపై ఏసీబీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. విశాఖతో పాటు మూడు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగాయి. విశాఖ, అనకాపల్లిలోని నగేష్‌కుమార్‌ ఇళ్లు, పాడేరులోని కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు.

ఈ సోదాల్లో నగేష్‌కుమార్, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో రెండు ఫ్లాట్లు, 9 ఇళ్ల స్థలాలు, 6.50 ఎకరాల సాగు భూమి, రెండు కార్లు, నగదు, బంగారు, వెండి వస్తువులను గుర్తించారు. వాటి విలువ రూ.2,06,17,622 ఉంటుందని అంచనా వేశారు. మొత్తంగా ప్రాథమిక దర్యాప్తులో ఆదాయానికి మించి రూ.1,34,78,180 ఆస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించారు. బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉంది. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ ప్రధాన కార్యాలయం పేర్కొంది. 

మరిన్ని వార్తలు