పంచాయతీరాజ్‌ డీఈఈపై ఏసీబీ పంజా

28 Apr, 2021 04:08 IST|Sakshi
సుధాకర్‌ ఇంటి వద్ద ఏసీబీ అధికారులు

రూ.1.31 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తింపు

సాక్షి, అమరావతి/కడప అర్బన్‌/తిరుపతి: కడప పంచాయతీరాజ్‌ శాఖలోని క్వాలిటీ కంట్రోల్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (డీఈఈ) రామిశెట్టి సుధాకర్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పంజా విసిరింది. అక్రమాస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదుతో ఏసీబీ అధికార బృందాలు కడప విజయదుర్గ కాలనీలో నివసిస్తున్న సుధాకర్‌ ఇంటితో పాటు, అతని కుమార్తె, స్నేహితుడు, ఆయన బిజినెస్‌ పార్టనర్‌ వేణుగోపాల్, మైదుకూరులోని దగ్గరి బంధువు, రైల్వేకోడూరులోని వియ్యంకుడు, తిరుపతిలో నివాసం ఉంటున్న అతని తమ్ముడు మురహరి ఇంటిపైనా దాడులు నిర్వహించాయి.

సుధాకర్, అతని కుటుంబ సభ్యుల పేరిట కడప విజయదుర్గ కాలనీలో జీ+1 భవనం, కడపలో ఏడు నివాస స్థలాలు, మైదుకూరులో మూడు ఇళ్ల స్థలాలు, కడప శివారున 1.12 ఎకరాల ఖాళీ స్థలం ఉన్నట్టు గుర్తించారు. 156.22 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.24,685 విలువైన వెండి సామగ్రి, రూ.20,51,283 విలువైన ఇంటి సామగ్రి, రూ.14,13,493 బ్యాంకు బ్యాలెన్స్, రూ.1.46 లక్షల నగదును గుర్తించారు. మొత్తంగా రూ.1.31 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్టు ప్రాథమికంగా దొరికిన రికార్డులను బట్టి గుర్తించామని, అతన్ని అరెస్ట్‌ చేసి కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీజీ కార్యాలయం తెలిపింది. 

మరిన్ని వార్తలు