అవినీతి అధికారులకు ఇక హడలే!

9 Nov, 2022 03:40 IST|Sakshi

రెడ్‌హ్యాండెడ్‌గా దొరక్కపోయినా అరెస్టులు

సరికొత్త వ్యూహంతో చెక్‌ పెడుతున్న అవినీతి నిరోధక శాఖ

లంచం తీసుకున్న రెండునెలల తరువాత ఓ కేసులో సీఐ, ఎస్సై అరెస్టు

ఆకస్మిక తనిఖీల తర్వాత కొన్ని నెలలకు సబ్‌ రిజిస్ట్రార్‌ అరెస్టు

సమగ్ర దర్యాప్తుతో ఆధారాలు సేకరించి అరెస్టుచేస్తున్న ఏసీబీ

సాక్షి, అమరావతి: ‘సాధారణంగా లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికితేనే ఏసీబీ అరెస్టు చేస్తుంది. మధ్యవర్తుల ద్వారానో ఇతర మార్గాల్లోనో లంచం తీసుకుంటే ఏం కాదు’.. ఇదీ దశాబ్దాలుగా రాష్ట్రంలో అవినీతి అధికారుల్లో నెలకొన్న ధీమా. దాంతో ఏసీబీకి దొరక్కుండా వారు అవినీతికి పాల్పడుతున్నారు. కానీ, అవినీతిపరుల ఈ ధీమాకు ఏసీబీ చెక్‌ పెడుతోంది. సరికొత్త పంథాతో అవినీతి అధికారులను హడలెత్తిస్తోంది. మూడో కంటికి తెలీకుండా లంచాలు తీసుకున్నా సరే సమగ్ర దర్యాప్తుతో ఆటకట్టిస్తోంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రెడ్‌హ్యాండెడ్‌గా దొరకనప్పటికీ.. సమగ్ర దర్యాప్తుతో ఆధారాలు సేకరించి అక్రమార్కులను ఏసీబీ అరెస్టుచేస్తోంది. 

బురిడీ కొట్టిస్తున్న అవినీతి అధికారులు
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని ఏర్పాటుచేసినప్పటి నుంచి ఇప్పటివరకు  ప్రధానంగా మూడు కేటగిరీల ఆధారంగానే విధులు నిర్వహిస్తోంది. ఎవరైనా లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికితే అరెస్టుచేసి కేసు నమోదు చేస్తోంది.. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఆధారాలు లభిస్తే కేసు నమోదు చేస్తుంది.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అనధికారిక డబ్బులు దొరికినా.. ఇతరత్రా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆధారాలు లభించినా కేసు నమోదు చేస్తుంది. కానీ, ఈ మూడు విధానాల నుంచీ అవినీతి అధికారులు చాకచక్యంగా తప్పించుకుంటున్నారు.

తాము నేరుగా కాకుండా మధ్యవర్తుల ద్వారా లంచాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, చెక్‌పోస్టులు, రెవెన్యూ తదితర కార్యాలయాల్లో ఇదే విధానం కొనసాగిస్తున్నారు. ఆదాయనికి మించి ఉన్న ఆస్తుల కేసుల్లో కూడా తమ ఆస్తులకు కాకి లెక్కలు చెబుతున్నారు. ఇక ఆకస్మిక తనిఖీల్లో డబ్బులు లభించినా అవి ఎవరివో అన్నది చెప్పలేరు. కాబట్టి ఏసీబీ అధికారులు తాము చేసిన తనిఖీలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చి సరిపెట్టుకునేవి. 

ఇక నుంచి ఒక లెక్క..
కానీ, అవినీతి అధికారుల్లో ధీమా.. మితిమీరిన అవినీతికి చెక్‌ పెడుతూ ఏసీబీ సరికొత్త కార్యాచరణను చేపట్టింది. ప్రధానంగా అవినీతి నిర్మూలనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఏసీబీ ప్రవేశపెట్టిన 14400 మొబైల్‌ యాప్‌ దోహదపడుతోంది. గతంలో కేవలం 14400 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ ద్వారానే బాధితులు ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉండేది.

ఇప్పుడు ఈ యాప్‌ వినూత్న ఫీచర్లతో బాధితులకు అండగా నిలుస్తోంది. అవినీతికి సంబంధించి పత్రాలు, ఆడియో, వీడియో రికార్డింగులు కూడా 14400 యాప్‌ ద్వారా ఏసీబీ అధికారులకు సమర్పించేందకు అవకాశం ఏర్పడింది. దీంతో ఆధారాల సేకరణకు మార్గం సుగమమైంది. బ్యాంకు ఖాతాలు, కాల్‌ డేటాలు, ఇతరత్రా ఆధారాలతో అవినీతిని నిరూపించే రీతిలో ఆధారాలు సేకరించి సంబంధిత అధికారులను అరెస్టుచేస్తోంది. ఉదా..

లంచం తీసుకున్న రెండునెలల తర్వాత..
కృష్ణాజిల్లా తోట్లవల్లేరుకు చెందిన గడికొయ్య శ్రీనివాసరెడ్డి హత్య కేసులో అదే గ్రామానికి చెందిన ఆళ్ల శ్రీకాంత్‌రెడ్డి, మిథునలను పోలీసులు ఈ ఏడాది జులై 26న అరెస్టుచేశారు. ఈ హత్య కేసులో శ్రీకాంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల పేర్లు చేర్చకుండా ఉండేందుకు సీఐ ముక్తేశ్వరరావు రూ.15లక్షలు, ఎస్సై అర్జున్‌ రూ.2లక్షలు లంచం డిమాండ్‌ చేశారు. శ్రీకాంత్‌రెడ్డి బంధువు జొన్నల నరేంద్రరెడ్డి ద్వారా ఈ వ్యవహారం నడిపారు. శ్రీకాంత్‌రెడ్డి తల్లిదండ్రులు నరేంద్రరెడ్డికి రూ.19.36 లక్షలిచ్చారు.

ఆ మొత్తం నుంచి నరేంద్రరెడ్డి సీఐ ముక్తేశ్వరరావుకు రూ.12.50 లక్షలు, ఎస్సై అర్జున్‌కు రూ.1.50 లక్షలు లంచం ఇచ్చారు. పోలీసుల పేరుచెప్పి నరేంద్రరెడ్డి ఎక్కువ మొత్తం తీసుకున్నాడని శ్రీకాంత్‌రెడ్డి బంధువు పుచ్చకాయల శ్రీనివాసరెడ్డికి తెలిసింది. ఆ విషయం ఆయన శ్రీకాంత్‌రెడ్డి తల్లిదండ్రులకు చెప్పారు. దాంతో నరేంద్రరెడ్డి ఆగ్రహించి పుచ్చకాయల శ్రీనివాసరెడ్డిని హత్యచేశారు.

ఈ కేసు విచారించిన ఆత్కూరు పోలీసులు నరేంద్రరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించడంతో సీఐ, ఎస్సైల అవినీతి బండారం కూడా బయటపడింది. కానీ.. సీఐ, ఎస్సై లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరకలేదు. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశించారు. బ్యాంకు లావాదేవీల వ్యవహారాలు, కాల్‌డేటా, ఇతర ఆధారాలను ఏసీబీ అధికారులు సేకరించి బాధితుల వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం సీఐ, ఎస్సైలను ఏసీబీ అక్టోబర్‌ 14న అరెస్టుచేసింది. 

ఆకస్మిక తనిఖీల అనంతరం దర్యాప్తుచేసి మరీ..
అలాగే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆకస్మిక తనిఖీల్లో కర్నూలు కల్లూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మధ్యవర్తుల వద్ద రూ.59,300లు జప్తుచేశారు. కానీ, ఆ డబ్బులు ఎవరివన్నది ఆ రోజు నిరూపించలేకపోయారు. ఏసీబీ మాత్రం సమగ్రంగా విచారించింది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వారంరోజులపాటు జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. సంబంధిత వ్యక్తులను విచారించారు. మధ్యవర్తుల బ్యాంకు ఖాతాలు, సబ్‌ రిజిస్ట్రార్, ఆయన కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల లావాదేవీలు అన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. అనంతరం సబ్‌ రిజిస్ట్రార్‌ను అరెస్టుచేశారు.  

మరిన్ని వార్తలు