స్కిల్ కేసు: ఈ నెల 29కి విచారణ వాయిదా

23 Jan, 2024 18:31 IST|Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌’ కుంభకోణం కేసులో అప్రూవర్‌గా మారతానని ఏసీఐ ఎండి శిరీష్ చంద్రకాంత్ షా వేసిన పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. చంద్రబాబు న్యాయవాదులు కౌంటర్ వేయడానికి సమయం‌ కోరారు. కేసులో సీఐడి కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని కోరారు. దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని  చంద్రబాబు తరుపున న్యాయవాదులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. అప్పటి వరకు శిరీష్ చంద్రకాంత్ షా స్టేట్‌మెంట్ రికార్డును ఏసిబి కోర్టు వాయిదా వేసింది.

చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యంతరాలపై మంగళవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిపింది. ఈ సందర్భంగా కౌంటర్ వేయడానికి సమయమివ్వాలని చంద్రబాబు న్యాయవాదులు ఏసీబీ కోర్టును కోరారు. దీంతో ఏసీబీ కోర్టు విచారణను 29కి వాయిదా వేసింది. స్కిల్ కేసులో అప్రూవర్‌గా మారుతున్నట్లు ఇప్పటికే ఏసీబీ కోర్టులో చంద్రకాంత్ షా పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

బోగస్ ఇన్వాయిస్‌లతో నిధులు స్వాహా చేశారని కోర్టుకి చంద్రకాంత్ షా ఆధారాలు సమర్పించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన ఎ-22 నిందితుడు యోగేష్ గుప్తా నిధుల అక్రమ తరలింపులో కీలక పాత్ర పోషించారని చంద్రకాంత్ షా పేర్కొన్నారు. స్కిల్ కేసులో ఎ-26 నిందితుడు సావన్ కుమార్ జజూతో కలిసి యోగేష్ గుప్తా 2016లో తనని కలిశారని తెలిపారు. డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీలకి సాఫ్ట్ వేర్ సమకూర్చినట్లుగా బోగస్ ఇన్వాయిస్‌లని ఇవ్వాలని వారు కోరినట్లు పిటిషన్‌లో చంద్రకాంత్ షా పేర్కొన్నారు.

ఏసీఐ కంపెనీ తరపున స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిస్‌లు, డిజైన్ టెక్‌కి రెండు బోగస్ ఇన్వాయిస్‌లు ఇచ్చానని తెలిపారు. బోగస్ ఇన్వాయిస్‌లు ఇచ్చినందుకు రూ. 65 కోట్లు తన కంపెనీ ఖాతాలో నిధులు జమ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అవే నిధులని సావన్ కుమార్ చెప్పిన పలు డొల్ల కంపెనీలకి మళ్లించానని చెప్పారు. ఆ రూ.65కోట్ల నిధులనే టీడీపీ ఖాతాలోకి చేరినట్లుగా ఇప్పటికే సీఐడీ గుర్తించింది. అడ్డంగా దొరికిపోవడంతో చంద్రకాంత్ షా వాంగ్మూలం అడ్డుకునేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదుల కుట్రలు పన్నుతున్నారు.

చదవండి: స్కిల్‌ స్కాంలో చంద్రబాబు పాత్రకు ఆధారాలున్నాయి 

>
మరిన్ని వార్తలు