బందరు కార్పొరేషన్‌పై ఏసీబీ ఫోకస్‌

23 Jun, 2021 04:33 IST|Sakshi
నగరపాలక సంస్థ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్న ఏసీబీ అధికారులు

పన్నుల వసూళ్లలో సిబ్బంది చేతివాటంపై ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు 

మచిలీపట్నం: మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో పన్ను వసూళ్లలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఫిర్యాదులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సారించారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శరత్‌బాబు నేతృత్వంలో అధికారుల బృందం ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు నిరాటంకంగా తనిఖీలు చేపట్టింది. మంచినీటి సరఫరా, ఇంటి పన్నుల వసూళ్లకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించారు. పన్నుల వసూళ్లలో లోపాలను గుర్తించారు.

వాటిని పూర్తిస్థాయిలో పరిశీలన చేసే క్రమంలో 12, 15వ డివిజన్ల పరిధిలోని కొన్ని ఇళ్లను పరిశీలించారు. కొన్ని ఇళ్లను రికార్డుల్లో చిన్నవిగా చూపించగా.. క్షేత్రస్థాయిలో భారీ భవనాలు ఉండటాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. డీఎస్పీ శరత్‌బాబును వివరణ కోరగా.. తనిఖీల్లో కొన్ని లోపాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఆన్‌లైన్‌లో గుడిసెల పేరుతో టాక్స్‌లు వసూలు చేస్తుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం భవనాలు ఉన్నట్లు పరిశీలనలో తేలిందన్నారు. మరింత లోతుగా విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. తనిఖీల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు