మునిసిపల్‌ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు

4 Aug, 2022 03:49 IST|Sakshi

సూళ్లూరుపేట కమిషనర్‌ చాంబర్‌ కిటికీ వద్ద నోట్ల కట్టలు

నరసరావుపేట టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో అవకతవకల గుర్తింపు

సాక్షి, అమరావతి/సూళ్లూరుపేట/నరసరావుపేట: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట మునిసిపల్‌ కార్యాలయాల్లో బుధవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. భవన నిర్మాణాలకు అనుమతులు, అక్రమ నిర్మాణాలు అడ్డుకోకపోవడం వంటి వాటిపై ఫిర్యాదులు రావడంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. సూళ్లూరుపేట మునిసిపల్‌ కార్యాలయం వద్ద నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేటలో ఒక భవనం కొలతలు తీసుకున్నారు. ఈ తనిఖీలు నేడు కూడా కొనసాగే అవకాశం ఉంది. 

రూ.1.9 లక్షల స్వాధీనం
సూళ్లూరుపేట మునిసిపల్‌ కార్యాలయంపై ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏసీబీ డీఎస్పీ మోహన్‌ నేతృత్వంలోని అధికారులు తనిఖీలు చేపట్టారు. భవన నిర్మాణ అనుమతుల విషయంలో అవినీతి జరుగుతోందని స్పందనలో సూళ్లూరుపేటకు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ దాడులు చేశారు. ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి వచ్చిన వెంటనే మునిసిపల్‌ కమిషనర్‌ చాంబర్‌ కిటికీకి పక్కనే రూ.500 నోట్ల కట్టలు రెండు, వంద రూపాయల నోట్ల కట్ట ఒకటి కనిపించాయి.

వాటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్‌ కారులో రూ.50 వేలు దొరికాయి. కొందరు ఉద్యోగుల వద్ద రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1.90 లక్షలు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. టౌన్‌ ప్లానింగ్‌ సెక్షన్‌కు అధికారి లేకపోవడంతో ఆ బాధ్యతలను ప్రస్తుతం కమిషనర్‌ చూస్తున్నారు.

వసూలు చేసిన ఫీజు అధికారుల వద్దే..
నరసరావుపేట మునిసిపల్‌ కార్యాలయంలో ఏసీబీ అదనపు ఎస్పీ జె.వెంకటరావు ఆధ్వర్యంలో డీఎస్పీ ప్రతాప్‌కుమార్, ఇతర అధికారులు తనిఖీలు చేశారు. రికార్డులు, కంప్యూటర్లను తమ ఆధీనంలోకి తీసుకుని ప్లాన్‌ల∙వివరాలను పరిశీలించారు. పాతూరు ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోని ఒక నూతన భవనాన్ని టేపులతో కొలతలు తీసుకున్నారు. ఆ సమయంలో మునిసిపల్‌ కమిషనర్‌ డి.రవీంద్ర అక్కడే ఉండగా టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ అంతకు గంటముందే తనకు ఆరోగ్యం బాగాలేదంటూ ఒక ప్రైవేటు వైద్యశాలలో చేరినట్లు తెలిసింది.

తరువాత ఏసీబీ అధికారుల ఆదేశాల మేరకు టీపీఎస్‌తోపాటు పలువురు ఉద్యోగులు కార్యాలయానికి వచ్చారు. అదనపు ఎస్పీ వెంకటరావు విలేకర్లతో మాట్లాడుతూ పట్టణ ప్రణాళిక విభాగంపై తమకు రెండు ఫిర్యాదులు వచ్చాయన్నారు. తమ తనిఖీల్లో చాలా అవకతవకలను కనుగొన్నట్లు చెప్పారు. ప్లాన్‌కు విరుద్ధంగా, అసలు ప్లాన్‌ తీసుకోకుండా నిర్మాణాలు చేస్తున్నా టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నియంత్రించలేదని తెలిపారు. అనుమతి ఇచ్చిన ప్లాన్‌కు సంబంధించిన ఫీజును వీరే వసూలు చేసి తమ దగ్గరే ఉంచుకున్నారని చెప్పారు.  

మరిన్ని వార్తలు