చినవెంకన్న గుడిలో  ఏసీబీ తనిఖీలు 

9 Sep, 2020 10:42 IST|Sakshi
శేషాచలకొండపైన సెంట్రల్‌ స్టోర్‌లో స్టాకును పరిశీలించి, సిబ్బంది నుంచి వివరాలు రాబడుతున్న ఏసీబీ సిబ్బంది  

సాక్షి, ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఆలయంలోని పలు విభాగాల్లో జరుగుతున్న అవకతవకలపై అందిన ఫిర్యాదులు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏలూరు ఏసీబీ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ దాడులను జరిపారు. ఏకకాలంలో డీఎస్పీతో సహా ఇద్దరు సీఐలు రవీంద్ర, శ్రీనివాసరావు, మరో 9 మంది ఏసీబీ సిబ్బంది, అలాగే వివిధ శాఖలకు చెందిన మరో పది మంది (సహాయకులు) ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. వీరంతా ఏడు బృందాలుగా విడిపోయి ఒకే సమయంలో అన్ని విభాగాల్లోనూ సోదాలను చేపట్టారు. ప్రధానంగా ప్రసాదాల తయారీ కేంద్రం (అంబరుఖానా), సెంట్రల్‌ స్టోర్, టోల్‌ప్లాజా, అలాగే ప్రసాదాలు, టికెట్‌ విక్రయాల కౌంటర్లు, అన్నదానం, ఇంజినీరింగ్, లీజియస్‌ ఇలా అన్ని పరిపాలనా విభాగాల్లోనూ తనిఖీలను నిర్వహించారు.

అలాగే స్వామి దర్శనార్థం ఆలయంలోకి వెళ్లే భక్తుల టికెట్లను పరిశీలించారు. ప్రసాదాల తయారీలో దిట్టంను సరిగ్గా అనుసరిస్తున్నారా? లేక ఏవైనా అవకతవకలకు పాల్పడుతున్నారా? అన్నదానిపై స్వయంగా ప్రసాదాలను తూకం వేసి తనిఖీ చేశారు. సెంట్రల్‌ స్టోర్‌లో నిల్వ ఉన్న స్టాకును, సంబంధిత రికార్డులను పరిశీలించారు. స్టోర్‌లో ఉండాల్సిన వాటికంటే ఏమైనా సరుకులు ఎక్కువ, తక్కువలు ఉన్నాయా అన్న కోణంలోనూ సోదాలు జరిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా ఈ తనిఖీలు జరిగాయి.  గుర్తించిన అవకతవకలకు సంబంధించిన పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ వెంకటేశ్వరరావు వెల్లడించారు.  

గుర్తించిన అవకతవకలు   

 • ప్రభుత్వ ఉత్తర్వులు, జీఓలను తుంగలోకి తొక్కి అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరును రికార్డుల ద్వారా ఏసీబీ అధికారులు గుర్తించారు.  
 • కొండపైన, దిగువన దేవస్థానం షాపుల అద్దెల వసూలు విషయంలో సంబంధిత ఆలయ అధికారులు నిబంధనలను కాలరాసినట్లు గుర్తించారు.  
 • దుకాణదారుల నుంచి ముందే వసూలు చేయాల్సిన ఏడాది లీజు సొమ్మును నెలసరి వాయిదాల పద్ధతిలో కట్టించుకుంటూ, షాపుల యజమానులతో కుమ్మక్కై శ్రీవారి ఆదాయానికి అధికారులు గండి కొడుతున్నట్లు తెలుసుకున్నారు.   
 • భక్తుల తలనీలాల కాంట్రాక్టరుకు వెసులుబాటు కల్పిస్తూ పాట మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో వసూలు చేస్తూ.. కోట్లాది రూపాయలు పక్కదారి పట్టడానికి కారణమవుతున్నట్లు గుర్తించారు. 
 • అంబరుఖానాలో ఇటీవల మాయమైన 11 వందల కేజీల నెయ్యి కుంభకోణంపై ఆలయ అధికారులు పోలీసు కేసు పెట్టకపోవడాన్ని తప్పుబడుతున్నారు.  
 • ప్రసాదాల తయారీని టెండర్‌ పద్ధతిన కాకుండా, ఇష్టానుసారంగా కాంట్రాక్టర్లకు కట్టబెట్టడాన్ని గుర్తించారు.  
 • దేవస్థానంలో ఉపయోగిస్తున్న వాహనాల ఇంధన వినియోగం, అద్దెకు తీసుకున్న ప్రైవేటు వాహనాలకు అధికంగా చెల్లింపులు జరుపుతున్నట్టు గుర్తించారు.  
 • బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా అతి తక్కువ అద్దెకు షాపును పొందిన వ్యక్తి, మరో వ్యక్తికి ఆ షాపును అధిక లీజుకు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై ఆరా తీశారు.  
 • ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించి గతంలో ఈఎండీ (ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌) సొమ్ము విషయంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.  
 • ఇటీవల బదిలీ అయిన ఆలయ ఈఓ ఇంకా దేవస్థానం గెస్ట్‌ హౌస్‌ను, సెక్యురిటీ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఆరా తీశారు.  
 • పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలనూ ఆరా తీశారు. 

మరిన్ని వార్తలు