తహశీల్దార్, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

3 Sep, 2020 04:05 IST|Sakshi
చిత్తూరు జిల్లా పీలేరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో బుధవారం సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు

తహశీల్దార్‌ కార్యాలయాల్లో రూ.3,50,277 స్వాధీనం 

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో లెక్క చూపని నగదు రూ.9,23,940 

గూడూరులో నిబంధనలకు విరుద్ధంగా 33 భవన నిర్మాణ అనుమతులు

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్, సబ్‌ రిజిస్ట్రార్, మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించింది. సంతకవిటి (శ్రీకాకుళం జిల్లా), బలిజిపేట (విజయనగరం జిల్లా), కశింకోట (విశాఖ జిల్లా), కొయ్యలగూడెం (పశ్చిమగోదావరి జిల్లా), ఇబ్రహీంపట్నం(కృష్ణా జిల్లా), రాజుపాలెం (గుంటూరు జిల్లా), ఉలవపాడు (ప్రకాశం జిల్లా), ఎమ్మిగనూరు (కర్నూలు జిల్లా), కూడేరు (అనంతపురం జిల్లా) తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది లెక్కల్లో చూపించని నగదును స్వాధీనం చేసుకున్నారు.

► రైతులకు పంపిణీ చేయకుండా ఉన్న పట్టాదార్‌ పాస్‌పుస్తకాలను గుర్తించారు. ‘స్పందన’, ‘మీ సేవ’ పోర్టళ్లలో చేసిన దరఖాస్తులను నిర్ణీత గడువు ముగిసినప్పటికీ పరిష్కరించ లేదని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. కొన్ని కార్యాలయాల్లో ప్రైవేట్‌ సిబ్బంది పని చేస్తున్నారని గుర్తించారు. 
► తహసీల్దార్‌ కార్యాలయాలపై జరిపిన సోదాల్లో మొత్తం మీద లెక్కల్లో చూపించని రూ.3,50,277 నగదును స్వాధీనం చేసుకున్నారు. 
► బిక్కవోలు (తూర్పు గోదావరి జిల్లా), జగ్గయ్యపేట (కృష్ణా జిల్లా), బద్వేలు (వైఎస్సార్‌ జిల్లా), పీలేరు (చిత్తూరు జిల్లా) సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. 
► సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాల్లో అనధికార వ్యక్తులు పని చేస్తున్నట్టు గుర్తించారు. మొత్తం మీద లెక్కల్లో చూపించని రూ.9,23,940 స్వాధీనం చేసుకున్నారు. 
► నెల్లూరు జిల్లా గూడురు మున్సిపల్‌ కార్యాలయంలోని టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం ఆఫీసు సమయం ముగిసిన తర్వాత కూడా నిబంధనలకు విరుద్ధంగా 33 భవన నిర్మాణ అనుమతులు ఇచ్చినట్టు గుర్తించారు. ఈ సోదాలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని ఏసీబీ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా