ఇక రయ్‌.. రయ్‌..

31 Dec, 2021 03:38 IST|Sakshi
వేగంగా జరుగుతున్న అనంతపురం జిల్లా కదిరి–హిందూపూర్‌ రోడ్డు పునరుద్ధరణ పనులు

జోరుగా రోడ్ల పునరుద్ధరణ.. రాష్ట్ర వ్యాప్తంగా పనులు వేగవంతం

మొదటి దశలో రూ.603 కోట్లతో 328 రోడ్ల పనులు 

రెండో దశలో రూ.1,601 కోట్లతో 819 రోడ్ల పనులకు త్వరలో టెండర్ల ఖరారు

వేసవి నాటికి పనుల పూర్తే లక్ష్యంగా కార్యాచరణ 

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ పనులు జోరందుకున్నాయి. వర్షాలు తగ్గగానే పనులు ప్రారంభిస్తామని  సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పిన మాట మేరకు ప్రస్తుతం ఎక్కడికక్కడ పనులు వేగంగా సాగుతున్నాయి. ఎక్కడా గతుకులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగేలా ప్రభుత్వం రోడ్ల రూపురేఖలు మార్చేస్తోంది. రూ.2,205 కోట్లతో 1,147 రోడ్ల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రెండు దశల్లో కార్యాచరణను వేగవంతం చేసింది. విజయనగరం జిల్లాలో భీమసింగి–కొత్తవలస, విశాఖ జిల్లాలో పాడేరు ఏజెన్సీ రోడ్డు, సుజనకోట బీచ్‌ రోడ్డు, ప్రకాశం జిల్లాలో ఒంగోలు– బేస్తవారిపేట రోడ్డు, చిత్తూరు జిల్లాలో దామలచెరువు– పులిచెర్ల రోడ్డు, వైఎస్సార్‌ జిల్లాలో కడప–రేణిగుంట రోడ్డు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పునరుద్ధరణ పనులు కొన్నిచోట్ల ఇప్పటికే పూర్తయ్యాయి.

టీడీపీ ప్రభుత్వంలో నిర్వహణ నిధులను దారి మళ్లించడంతో తీవ్ర నిర్లక్ష్యానికి గురై దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ బాధ్యతను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భుజానికెత్తుకుంది. గత రెండేళ్లలో భారీ వర్షాలతో రోడ్ల పునరుద్ధరణ పనుల్లో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రోడ్ల పునరుద్ధరణ పనులపై ఆర్‌ అండ్‌ బి శాఖకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. నేరుగా బ్యాంకుల నుంచే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు కోసం ప్రత్యేక అనుమతులు మంజూరు చేయడం ద్వారా సానుకూల వాతావరణం సృష్టించారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పనులు ఊపందుకున్నాయి. 

మొదటి దశలో 328 రోడ్ల పునరుద్ధరణ
రాష్ట్రంలో మొదటి దశలో రూ.603.68కోట్లతో రోడ్ల పునరుద్ధరణ కోసం 328 పనులకు ఆర్‌ అండ్‌ బి శాఖ టెండర్లు ఖరారు చేసింది. వర్షాకాలం ముగియడంతో నవంబరులో ఆ పనులు చేపట్టారు. వాటిలో ఇప్పటికే రూ.41.15 కోట్ల విలువైన రోడ్ల పునరుద్ధరణ పనులను పూర్తి చేశారు. వాటిలో 12 రాష్ట్ర రహదారులు, 15 జిల్లా ప్రధాన రహదారులు ఉన్నాయి. వాటికి సంబంధించిన బిల్లులను కూడా అప్‌లోడ్‌ చేశారు. దాంతో బ్యాంకులు నేరుగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించనున్నాయి. మరో రూ.32.46 కోట్ల విలువైన రోడ్ల పునరుద్ధరణ పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి.

వాటిలో 16 రాష్ట్ర రహదారులు, 19 జిల్లా ప్రధాన రహదారులు ఉన్నాయి. వెరసి రూ.73.61 కోట్ల పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. మిగిలిన రూ.530.07 కోట్ల పనులను ఈ వారంలో ప్రారంభించేందుకు కాంట్రాక్టర్లు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి దశలో మొత్తం రూ.603 కోట్ల పనులు ఫిబ్రవరి చివరికి పూర్తి చేయాలని ఆర్‌ అండ్‌ బి శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

రెండో దశ టెండర్లు త్వరలో ఖరారు
రెండో దశ కింద 819 రోడ్ల పునరుద్ధరణకు ఆర్‌ అండ్‌ బి శాఖ సన్నాహాలు వేగవంతం చేసింది. అందుకోసం రూ.1,601.32 కోట్లతో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టింది. ఆ టెండర్లను 2022 జనవరి రెండో వారంలోగా ఖరారు చేయనున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో పనులు ప్రారంభించి మే మొదటి వారానికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు కార్యాచరణను వేగవంతం చేశామని ఆర్‌ అండ్‌ బి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ‘సాక్షి’కి తెలిపారు. పూర్తి నాణ్యతతో రోడ్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని త్వరలో రెండో దశ టెండర్లను కూడా ఖరారు చేసి వేసవి నాటికి పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ ఎండీ శ్రీనివాసరెడ్డి చెప్పారు. 

మరిన్ని వార్తలు