ఏపీఐఐసీ ఆన్‌లైన్‌ సేవలకు ఆదరణ

19 Sep, 2022 04:23 IST|Sakshi

కార్యాలయానికి రాకుండానే అనుమతులు మంజూరు

4 నెలల్లో వివిధ అనుమతుల కోసం 389 దరఖాస్తులు 

అన్ని సేవలూ త్వరలో ఆన్‌లైన్‌లో: ఏపీఐఐసీ ఎండీ

సాక్షి, అమరావతి: పారిశ్రామిక ప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండానే ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌ ద్వారానే అన్ని సేవలు అందించేలా ఏపీఐఐసీ వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా 14 సేవలను అందిస్తుండగా.. త్వరలోనే అన్ని సేవలను అందించేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రహ్మణ్యం ‘సాక్షి’తో చెప్పారు.

ఆన్‌లైన్‌ సేవలను ప్రవేశపెట్టిన నాలుగు నెలల్లోనే మంచి స్పందన వస్తోందని, ఇప్పటి వరకు అనుమతుల కోసం 389 దరఖాస్తులు రాగా, నిర్ణీత గడువులోగా 144 అనుమతులు మంజూరు చేసినట్టు తెలిపారు. కొన్ని అనుమతులకు మరింత సమాచారం అవసరం కావడంతో తిరిగి పంపగా,  మిగిలిన దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నట్టు చెప్పారు.

సేవల విస్తరణ
ప్రస్తుతం వెబ్‌ ద్వారా సేవలను అందిస్తున్నామని, ఏపీఐఐసీ సేవల కోసం ఒక మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్టు ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రహ్మణ్యం తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారు అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలన్నీ ఆన్‌లైన్‌ ద్వారా అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలకనుగుణంగా సేవలను విస్తరిస్తున్నట్టు తెలిపారు.

పరిశ్రమ పేర్లు మార్చుకోవడం, కేటాయింపుల్లో మార్పు, కేటాయింపుల బదిలీ, పునఃకేటాయింపులు, కేటాయింపులను వెనక్కి తీసుకోవడం, లైన్‌ఆఫ్‌ యాక్టివిటీ మార్పు, పరిశ్రమకు చెందిన నియోజకవర్గ మార్పు, అడిషనల్‌ లైన్‌ యాక్టివిటీ, ప్లాట్‌ పరిమితుల అనుమతులు, ప్లాట్‌ డివిజన్, విభజనల మార్పులు, ఐదెకరాల్లోపు సేల్‌ డీడ్‌ ఎగ్జిక్యూషన్, ఐదెకరాలపైన సేల్‌ డీడ్‌ ఎగ్జిక్యూషన్‌ల విజ్ఞప్తులు, కేటాయించిన ప్లాట్‌కు సంబంధించిన ఎన్‌వోసీ(నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌), ప్రాజెక్టుకు అమలుకు నిర్దేశించిన గడువు పెంపు, ముందస్తు చెల్లింపులకు అవసరమైన గడువు పెంపు.. తదితర సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తున్నామని, త్వరలోనే మిగిలిన సేవలనూ ఆన్‌లైన్‌ పరిధిలోకి తీసుకురానున్నట్టు ఏపీఐఐసీ ఎండీ వివరించారు. 

మరిన్ని వార్తలు