Eluru Fire Accident: రసాయన పరిశ్రమలో ప్రమాదం

14 Apr, 2022 03:53 IST|Sakshi
నూజివీడు ఆస్పత్రిలో క్షతగాత్రులకు ప్రా«థమిక చికిత్స చేస్తున్న వైద్యసిబ్బంది. ఫ్యాక్టరీలో ఎగిసి పడుతున్న మంటలు

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు 

ముసునూరు: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ ఇండియా కెమికల్‌ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి బాయిలర్‌ పేలి ఇద్దరు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 10 మందికి గాయాలయ్యాయి. వీరిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. రాత్రి 11.30 గంటల తర్వాత ప్లాంట్‌–4లో అకస్మాత్తుగా బాయిలర్‌ పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ సమయంలో పని చేస్తున్న 30 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో గాయపడిన వారందరినీ ఏడు 108 అంబులెన్స్‌లలో నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స  అనంతరం వారిని విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఫ్యాక్టరీలో అగ్నికీలలు ఎగసి పడుతుండటం, దట్టంగా పొగ ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఘటన స్థలంలో ఇద్దరు మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇంకా మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా.. అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సుధీర్‌ (38), బారువల (30), షేక్‌ సుబానీ (30), కె. జోసఫ్‌(25), ఎం నాగరాజు(35), ఎస్‌ నాగేశ్వరరావు (45), విహారీ (25), టి రవికుమార్‌ (20), పి.సుధీర్‌కుమార్‌ (35), కిరణ్‌ (35), సీహెచ్‌ రాజు (38), ఎం చాష్మమ్‌ (32), రోషన్‌ మోచి (24) తదితరులు గాయపడిన వారిలో ఉన్నారు.

మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలో అగ్నిమాపక శాఖ, రెవెన్యూ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వస్తేగాని మృతుల సంఖ్య నిర్ధారించలేమని అధికారులు చెబుతున్నారు. కాగా, గాయపడ్డ కార్మికుల్లో ఆరుగురికి పైగా బీహార్‌ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. 

మరిన్ని వార్తలు