సొరంగంలో పని చేస్తుండగా.. హిటాచి వాహన ఆపరేటర్‌ దుర్మరణం 

7 Sep, 2022 08:57 IST|Sakshi
 గిరి మద్దిలేటి (ఫైల్‌)   

అవుకు (నంద్యాల): అవుకు సొరంగంలో పని చేస్తుండగా పైనుంచి రాళ్లు పడి హిటాచి వాహన ఆపరేటర్‌ దుర్మరణం చెందాడు. పనిలో చేరిన రెండో రోజు ఈ ఘటన జరగడంతో బాధిత కుటుంబం విషాదంలో  మునిగింది. పోలీసులు, కుటుంబసభ్యుల తెలిపిన వివరాల మేరకు..  బేతంచర్ల మండలం గోర్లగుట్ట గ్రామానికి చెందిన ఆల నారాయణ, ఆల కృష్ణవేణి దంపతులకు ఏకైక కుమారుడు ఆలగిరి మద్దిలేటి(28).

రెండున్నర ఏళ్ల క్రితం తండ్రి నారాయణ బైక్‌ ప్రమాదంలో మృతి చెందడంతో  కుటుంబ పోషణ భారం ఈ యువకుడిపై పడింది.   అవుకు మూడవ టన్నెల్‌లో పనిచేసేందుకు హిటాచి వాహనం ఆపరేటర్‌ కావాలని పిలుపు రావడంతో  ఈనెల 5వ తేదీ వెళ్లి విధుల్లో చేరాడు.  రెండో రోజు మంగళవారం  సొరంగంలోకి వెళ్లి పని చేస్తుండగా పై నుంచి ఉన్నట్టుండి  పెద్ద బండరాయి పడింది. ఈ ఘటనలో మద్దిలేటి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ విషయాన్ని టన్నెల్‌ నిర్మాణ అధికారులు  కుటుంబ సభ్యులకు చేరవేయడంతో వారు అక్కడికి చేరుకుని  మృతదేహంపై పడి బోరున విలపించారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతితో తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. ఏడాదిన్నర క్రితం డోన్‌ మండలం వెంగనాయునిపల్లె గ్రామానికి చెందిన మౌనికతో వివాహమైన మద్దిలేటికి ఆరు నెలల కుమారుడు మౌనిత్‌కుమార్‌ ఉన్నాడు. ప్రమాద ఘటనపై   కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు  ఎస్‌ఐ జగదీశ్వర్‌ రెడ్డి తెలిపారు. 

చదవండి: (భర్త వివాహేతర సంబంధాలు.. వేడినూనె పోసి చంపేందుకు భార్య...)

మరిన్ని వార్తలు