చలానా కుంభకోణంలో ఒక్కరే సూత్రధారి?

29 Aug, 2021 13:55 IST|Sakshi
ఆలమూరు సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో విచారణ చేస్తున్న సీఐ శివగణేష్‌

అనధికార ఉద్యోగి పాత్ర కీలకం!

కార్యాలయ సిబ్బంది పరోక్ష సహకారం

ఆలమూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పోలీసుల విచారణ  

సాక్షి, తూర్పుగోదావరి: అన్నీ తానయ్యాడు.. అందరినీ నమ్మించాడు.. అవకాశం చూశాడు.. అందినకాడికి దోచుకున్నాడు.. నకిలీ చలానా కుంభకోణానికి పాల్పడ్డాడు.. ఆలమూరు సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో చలానాల అవకతవకల కేసులో సూత్రధారి ఒక్కడేనని తెలుస్తోంది. రాష్ట్రంలో చలానా కుంభకోణం బయట పడిన తరువాత జిల్లాలోని 32 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఆలమూరులో చలానా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి ఆగస్టు 20 వరకూ 2,388 రిజిస్టేషన్లు జరగ్గా, వీటిలో 39 బోగస్‌గా నిర్ధారించి రూ.7,31,510 దుర్వినియోగం అయినట్లు తేల్చారు.

ఈ లావాదేవీలన్నీ ఓ అనధికార ఉద్యోగికి చెందిన రెండు బ్యాంకు ఖాతాల ద్వారా జరిగాయి. కుంభకోణానికి అసలు సూత్రధారి అని భావిస్తున్న ప్రైవేటు ఉద్యోగి నుంచే దుర్వినియోగమైన సొమ్మును సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయ సిబ్బంది రికవరీ చేసినా, అతనిపై ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. బోగస్‌ చలానా కుంభకోణానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఓ ఉద్యోగి సహకరించాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విషయం బయట పడిన వెంటనే అతడు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు సమాచారం. 
చదవండి: ఎక్కువగా బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్‌ తింటున్నారా.. ఈ సమస్య రావొచ్చు

అందరిదీ ఆ మాటే.. 
చలానా కుంభకోణంపై ఎట్టకేలకు ఫిర్యాదు అందడంతో ఆలమూరు పోలీసులు శనివారం విచారణ ప్రారంభించారు. మండపేట రూరల్‌ సీఐ పి.శివగణేష్‌, ఎస్సై ఎస్‌.శివప్రసాద్‌ కార్యాలయానికి వచ్చి సబ్‌ రిజిస్టార్‌ ఎ.సునందశ్రీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోగస్‌ చలానా దస్తావేజులను క్షుణ్ణంగా పరిశీలించారు. విచారణ చేసేందుకు వచ్చిన సీఐ శివగణేష్‌కు దస్తావేజు లేఖర్లంతా ఆ అనధికార ఉద్యోగి పైనే ఫిర్యాదు చేశారు. బోగస్‌గా తేల్చిన చలానాలన్నీ రెండు బ్యాంకు ఖాతాల ద్వారానే జరిగాయని, వాటిల్లో పొందుపరచిన ఫోన్‌ నంబర్లు కూడా అతడివేనని చెప్పారు.

దుర్వినియోగమైన సొమ్ము కూడా అతడి ఖాతా నుంచే రికవరీ అయ్యిందని తెలిపారు. బోగస్‌గా గుర్తించిన 39 చలానాల్లో అత్యధికంగా డి.దుర్గాప్రసాద్‌ 30, వై.శ్రీరామచంద్రమూర్తి 6, పి.భగవాన్, టి.జి.కృష్ణకు చెందిన ఒక్కొక్కటి ఉన్నాయి. పినపళ్లకు చెందిన కె.వెంకటరమణకు చెందిన బ్యాంకు డాక్యుమెంటూ బోగస్‌ చలానాలో ఉంది. కేసును త్వరితగతిన విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఐ చెప్పారు.
చదవండి: ఏపీ: నకిలీ చలానాల కేసులో రూ. 4 కోట్లు దాటిన రికవరీ 

అన్నీ అతనై.. 
కంప్యూటర్‌ వర్క్‌లో నిష్ణాతుడు కావడంతో అత్తిలి నవీన్‌కుమార్‌ అనే వ్యక్తిని ఆలమూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బంది అనధికారికంగా రోజువారీ వేతనంపై నియమించుకున్నారు. రిజిస్ట్రేషన్లు వేగంగా చేస్తాడనే కారణంగా కొంతమంది దస్తావేజు లేఖర్లు కూడా బ్యాంకుకు వెళ్లే పని లేకుండా నేరుగా అతడికే సొమ్ము చెల్లించి, అతడి బ్యాంకు ఖాతా ద్వారానే చలానాలు తీసుకునేవారు. ఇదే అదనుగా అతడు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో పీడీఎఫ్‌లో ఉన్న చలానాను మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌లోకి మార్చి రూ.లక్షల అక్రమాలకు పాల్పడ్డాడని సమాచారం. సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయ అధికారులకు నమ్మకంగా ఉంటూ ఓ ఉద్యోగి లాగిన్‌ నుంచే బోగస్‌ చలానాలకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం, కొంతమంది దస్తావేజు లేఖర్ల స్వార్థంతో 39 చలనాల్లో అక్రమాలకు ఇతడు కారణమయ్యాడు.      

ఆలమూరు సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో అక్రమాలు జరిగాయిలా.. 
► ఏప్రిల్‌ 1 నుంచి ఈ నెల 20 వరకూ రిజిస్ట్రేషన్లు:  2,388 
► వీటిలో బోగస్‌ చలానాలు :    39 
► రికవరీ చేసినది :  రూ.7,31,510 

మరిన్ని వార్తలు