ప్రత్యేక కోర్టు బెయిల్‌ తిరస్కరిస్తే అప్పీలే

4 Jun, 2022 02:47 IST|Sakshi

ఉపా కేసులపై హైకోర్టు స్పష్టీకరణ

ఆ అప్పీల్‌ను ధర్మాసనమే విచారించాలి

క్రిమినల్‌ పిటిషన్‌కు విచారణార్హత లేదు

మావోయిస్టు సానుభూతిపరుడు నాగన్న కేసులో తీర్పు

సాక్షి, అమరావతి: చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద నమోదైన కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్‌ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేస్తే, ఆ ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్‌ చేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ అప్పీల్‌ను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనమే విచారిస్తుందని తెలిపింది. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై క్రిమినల్‌ పిటిషన్‌ దాఖలుకు వీల్లేదని, దానికి విచారణార్హత లేదని తేల్చి చెప్పింది. మావోయిస్టు సానుభూతిపరుడు పంగి నాగన్న దాఖలు చేసిన క్రిమినల్‌ పిటిషన్‌ను కొట్టేసింది. ధర్మాసనం ముందు అప్పీల్‌ చేసుకునే వెసులుబాటును ఇచ్చింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ ఇటీవల తీర్పు వెలువరించారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న కారణంతో విశాఖ జిల్లా ముంచంగిపుట్టు పోలీసులు పంగి నాగన్నను 2020లో అరెస్ట్‌ చేశారు. తర్వాత కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేపట్టింది. నాగన్నపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో నాగన్న విజయవాడలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో రెండుసార్లు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని ప్రత్యేక కోర్టు కొట్టేసింది.

ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ నాగన్న హైకోర్టులో క్రిమినల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ విచారణ జరిపారు. ఈ పిటిషన్‌ విచారణార్హతపై ఎన్‌ఐఏ తరఫున వాదనలు వినిపించిన అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) ఎన్‌.హరినాథ్‌ అభ్యంతరం తెలిపారు. ఎన్‌ఐఏ చట్టం సెక్షన్‌ 21(4) కింద నిందితుల బెయిల్‌ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు కొట్టేస్తే, దానిపై ధర్మాసనం ముందు అప్పీల్‌ చేసుకోవాలే తప్ప, క్రిమినల్‌ పిటిషన్‌ దాఖలుకు వీల్లేదన్నారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. నాగన్న పిటిషన్‌కు విచారణార్హత లేదంటూ దానిని కొట్టేశారు.    

మరిన్ని వార్తలు