"తెల్ల" దొరలపై కొరడా

7 Sep, 2021 12:50 IST|Sakshi
పౌరసరఫరాల శాఖ కార్యాలయం

ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రైస్‌ కార్డుల స్వాదీనానికి చర్యలు 

ఇప్పటికే వివరాలు సేకరించిన పౌర సరఫరాల శాఖ అధికారులు 

జిల్లాలో ఉద్యోగుల వద్ద 7600లకు పైగా కార్డులు

వివరాలను రెవెన్యూ అధికారులకు పంపిన జిల్లా యంత్రాంగం  

సాక్షి,కడప: పేదల పేరుతో తెల్ల రేషన్‌ కార్డులు పొంది చౌక దుకాణాలలో బియ్యం, ఇతర నిత్యావసరాలు తీసుకుంటున్న అక్రమార్కులపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిబంధనలను కాదని పేదలకు దక్కాల్సిన సౌకర్యాలను పొందుతున్న ఉద్యోగుల నుంచి కార్డులను స్వాదీనం చేసుకునే చర్యలను ముమ్మరం చేసింది. కార్డును అడ్డం పెట్టుకుని సరుకులతో పాటు సంక్షేమ పథకాలను పొందుతున్న వేతనదారులపై కొరడా ఝుళిపించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. గతంలో కొంతమంది చిరుద్యోగులు రేషన్‌ కార్డు పొంది ఉన్నా.. వారు పదోన్నతి పొందిన తరువాత కూడా కార్డును ప్రభుత్వానికి అప్పజెప్పకుండా అలాగే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి రేషన్‌ కార్డులు పొందిన వైనంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పౌరసరఫరాల శాఖ అధికారులు వివరాలు సేకరించారు.  

నిబంధనలకు విరుద్ధం 
జమ్మలమడుగు, కడప, రాజంపేట రెవెన్యూ డివిజన్‌ల పరిధిలో వందల సంఖ్యలో కార్డులను గుర్తించి స్వాదీనం చేసుకుంటున్నారు. ఉద్యోగులకు సంబంధించిన కార్డులను వీఆర్‌ఓలు తనిఖీ చేయాల్సి ఉంది. జిల్లాలోని అనేక మండలాల్లో పలువురు ఉద్యోగులు రైస్‌ కార్డులు పొందారు. జిల్లా వ్యాప్తంగా 7600 మందికి పైగా ఉద్యోగుల వద్ద తెల్లరేషన్‌ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు రైస్‌ కార్డులు పొందడానికి అనర్హులు. కానీ పలువురు వీటిని తమ పలుకుబడితో సొంతం చేసుకున్నారు. బయోమెట్రిక్, ఆధార్‌ నంబర్‌ లాంటివి కార్డులకు జత చేసినా వారి వివరాలు బయటపడలేదు. ఆదాయపు పన్ను, పాన్‌ కార్డుల అనుసంధానంతో ఇటీవల ఈ అక్రమాలు వెలుగు చూశాయి. ప్రభుత్వ ఉద్యోగులు రేషన్‌ కార్డులు కలిగి ఉండకూడదంటూ ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసింది.   

కార్డులు మాత్రమే 
 జిల్లా వ్యాప్తంగా వీఆర్‌ఓలు, సచివాలయ ఉద్యోగులు, ఇతర శాఖలకు చెందిన ఉద్యోగుల వద్ద తెల్లరేషన్‌ కార్డులు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూనే వీరు అమ్మఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ పథకాలను పొందుతున్నారు. ప్రస్తుతానికి కార్డులను మాత్రమే స్వాధీనం చేసుకోనున్నారు. వీరి వివరాలను పూర్తిస్థాయిలో వారం రోజుల్లో ఇవ్వాలనే ఆదేశాలు మండలస్థాయి అధికారులకు జారీ అయ్యాయి. ఆ మేరకు నివేదికలు తయారు అవుతున్నాయి.

విచారణ జరుపుతున్నాం  
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగుల నుంచి తెల్లరేషన్‌ కార్డులు స్వా«దీనం చేసుకునేందుకు అవసరమైన విచారణ చేస్తున్నాం. ఇప్పటికే కార్డులున్న ఉద్యోగులను గుర్తించాం. గ్రామ, పట్టణ స్థాయిలో కచ్చితంగా ఉద్యోగుల వద్ద ఉన్న రేషన్‌కార్డులను స్వాధీనం చేసుకుంటాం. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం.  
– సౌభాగ్యలక్షి, డీఎస్‌ఓ, కడప 

చదవండిCM KCR Review On Heavy Rains: భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

మరిన్ని వార్తలు