గైర్హాజరైతే వెంటనే తొలగింపు

18 Sep, 2020 08:42 IST|Sakshi

డీఈవోలను ఆదేశించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చినవీరభద్రుడు

బోధన, బోధనేతర సిబ్బందికీ వర్తింపు

సాక్షి, అమరావతి: అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా, సెలవు పెట్టకుండా  విధులకు గైర్హాజరయ్యే బోధన, బోధనేతర సిబ్బందిని గుర్తించి, వారిని వెంటనే సర్వీసు నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఈ మేరకు డీఈవోలకు అంతర్గత ఉత్తర్వులు జారీచేశారు.  

ఎవరెవరిని సర్వీసు నుంచి తొలగిస్తారంటే..
అనుమతులు లేకుండా ఏడాదికి మించి విధులకు హాజరుకాకుండా ఉన్నవారు, సెలవు పెట్టి అయినా, పెట్టకుండా అయినా ఐదేళ్లుగా విధులకు హాజరుకాకుండా ఉన్నవారు, ప్రభుత్వం అనుమతించిన కాలపరిమితి దాటిపోయినా ఇతర విభాగాల్లో కొనసాగుతూ స్కూళ్ల విధులకు గైర్హాజరవుతున్న వారికి షోకాజ్‌ నోటీసు ఇచ్చి వివరణ తీసుకున్న అనంతరం చర్యలు చేపడతారు. అనుమతిలేకుండా గైర్హాజరైన కాలాన్ని రెగ్యులరైజ్‌ చేయాలని హెచ్‌ఎంలు, ఎంఈవోలు, టీచర్లు, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ నుంచివినతులు వస్తున్నాయి.

అయితే గైర్హాజరవ్వడం సర్వీస్‌ రూల్సు ప్రకారం మిస్‌కాండక్టుగా పరిగణించి వారిపై చర్యలు తీసుకోవలసిందేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 30 రోజులకుపైగా అనధికారికంగా ఆబ్సెంటులో ఉన్న హెడ్మాస్టర్లు, ఎంఈవోలు, టీచర్లు, నాన్‌టీచింగ్‌ సిబ్బందిని గుర్తించి వారికి షోకాజ్‌ నోటీసులు జారీచేయాలి. ఎవరైనా ఏడాదికి మించి రిపోర్టు చేయకుండా ఉన్న వారుంటే వారి పేర్లను పత్రికల్లో ముద్రించేలా చర్యలు చేపట్టాలి. అనంతరం వారి పేర్లను గెజిట్‌లో ముద్రించి చర్యలు చేపట్టాలి.  (ఆ లిమిట్స్ దాటితే అనేక సమస్యలు వస్తాయి)

మరిన్ని వార్తలు