విశాఖ: ఖాకీకో కహానీ.. ఎస్‌ఐ, ఇద్దరు హెచ్‌సీ, కానిస్టేబుల్‌పై చర్యలు?

8 Feb, 2023 11:48 IST|Sakshi

దొండపర్తి(విశాఖ దక్షిణ): ఈ ఖాకీలు ఒక్కొక్కరిది ఒక్కో కహాని. ఒక్కొక్కరు ఒక్కో ఆరోపణల్లో చిక్కుకున్నారు. ఉన్నతాధికారుల వేటుకు గురయ్యారు. నగర పోలీస్‌ కమిషనర్‌ సిహెచ్‌.శ్రీకాంత్‌ మంగళవారం ఒక ఎస్‌ఐ, ఇద్దరు హెచ్‌సీ, ఒక కానిస్టేబుల్‌పై బదిలీ వేటు వేయడం పోలీస్‌ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. 

విధుల్లో అలసత్వం సెటిల్‌మెంట్ల వ్యవహారాలకు పాల్పడే వారిని ఉపేక్షించకుండా చర్యలకు ఉపక్రమించడంతో మిగిలిన వారందరూ ఉలిక్కి పడ్డారు. కేసుల విషయంలో ఉన్నత స్థాయి నుంచి కానిస్టేబుళ్ల వరకు ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా వారికి మెమో జారీ చేయడం, బదిలీ, సస్పెన్షన్‌ వేటు వేస్తుండడంతో అందరిలోను గుబులు రేగుతోంది. తాజాగా నాలుగు పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరిగిన బదిలీలు అడ్మిని్రస్టేటివ్‌ గ్రౌండ్స్‌లో అయినట్లు చూపిస్తున్నప్పటికీ ఆరోపణలు కారణంగానే వారిపై బదిలీ వేటు పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

వీఆర్‌కు దువ్వాడ ఎస్‌ఐ  
దువ్వాడ లా అండ్‌ ఆర్డర్‌ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఎం.రాధాకృష్ణ వీఆర్‌కు అటాచ్‌ చేస్తూ నగర పోలీస్‌ కమిషనర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన కారణాలతో బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ.. ఎస్‌ఐపై వచ్చిన ఆరోపణలు కారణంగానే వేటు పడినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఒక 304ఏ కేసులో ఒకరి నుంచి లంచం డిమాండ్‌ చేసిన విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతోనే ఆయనను వీఆర్‌కు అటాచ్‌ చేసినట్లు పోలీస్‌ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఏఆర్‌కు ఇద్దరు హెచ్‌సీలు.. ఒక పీసీ 
పద్మనాభం పోలీస్‌స్టేషన్‌ లా అండ్‌ ఆర్డర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ టి.కాంతారావు, దువ్వాడ లా అండ్‌ ఆర్డర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఎం.సూరిబాబుతో పాటు పెందుర్తి లా అండ్‌ ఆర్డర్‌ కానిస్టేబుల్‌ ఆర్‌.సంతోకుమార్‌లను సీపీ శ్రీకాంత్‌ సిటీ ఏఆర్‌కు అటాచ్‌ చేశారు. అయితే విధులలో నిర్లక్ష్యం, సెటిల్‌మెంట్లు, కేసుల నమోదులో తేడాలు వంటి కారణాలపై వీరిని బదిలీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత నెలలో కూడా కేసుల నమోదులో తప్పుడు లెక్కలు చూపించిన 8 మంది కానిస్టేబుళ్లకు డీసీపీ సుమిత్‌ సునీల్‌గరుడ్‌ మెమోలు జారీ చేశారు. తాజాగా జరిగిన అటాచ్‌మెంట్లతో నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించే వారిని ఉపేక్షించేది లేదని సీపీ మరోసారి హెచ్చరికలు జారీ చేసినట్లయింది.

మరిన్ని వార్తలు