కృష్ణా జిల్లాలో ఏడుగురు ఏఈలపై చర్యలు 

3 Sep, 2021 04:18 IST|Sakshi
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌

జగనన్న ఇళ్ల పథకం అమలులో నిర్లక్ష్యం ఫలితం  

గాంధీనగర్‌ (విజయవాడసెంట్రల్‌): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇళ్ల పథకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు హౌసింగ్‌ ఏఈలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ వెల్లడించారు. పథకం అమలుపై మండల స్థాయి అధికారులతో గురువారం సాయంత్రం నందిగామ నియోజకవర్గం వీరులపాడు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖ అసిస్టెంట్‌ ఇంజనీర్ల నిర్లక్ష్యం కారణంగా ఇళ్ల నిర్మాణం కోస జిల్లాకు కేటాయించిన 750 టన్నుల ఉక్కు ఇతర జిల్లాలకు తరలిపోయిందన్నారు.

జగనన్న కాలనీలలో లే అవుట్‌లు పూర్తి అయి, ఇళ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉన్నా ఇంకా గ్రౌండింగ్‌ చేయని లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి వెంటనే నిర్మాణం చేపట్టేలా ఏఈలు చూడాలన్నారు. ఈ విషయంలో ప్రగతి సాధించని ఏఈలను సస్పెండ్‌ చేయడానికి కూడా వెనుకాడబోమని  హెచ్చరించారు. డ్వాక్రా మహిళలకు రుణం రాని కారణంగా ఇళ్ల నిర్మాణానికి కొందరు ముందుకు రావడం లేదన్న కారణం సరికాదని, వారికి ఇచ్చే రుణాలు ఇళ్ల నిర్మాణానికి అదనపు సహాయం మాత్రమేనని చెప్పారు.  

వీరిపై శాఖాపరమైన చర్యలు... 
గృహ నిర్మాణ శాఖ ఏఈలు పి.సుబ్బారావు (అవనిగడ్డ), బి.నెహ్రూ (కంకిపాడు), ఎన్‌.వెంకటేశ్వరరావు (నందిగామ), వెంకటేశ్వరరావు(చందర్లపాడు), సీహెచ్‌ ఎస్‌ఎస్‌ఆర్‌వీ ప్రసాద్‌ (విజయవాడ రూరల్‌), ఎన్‌.సాయిబాబు (వీరులపాడు), ఎ.నరసింహారావు (కంచికచర్ల) లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు