చురుగ్గా 44వ విడత ఫీవర్‌ సర్వే

26 Apr, 2022 05:01 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు పెద్దగా లేకపోయినప్పటికీ ముందస్తు అప్రమత్తతలో భాగంగా ప్రభుత్వం ఫీవర్‌ సర్వే కొనసాగిస్తోంది. వైద్యసిబ్బంది ప్రస్తుతం 44వ విడత ఫీవర్‌ సర్వే చేస్తున్నారు. ఇప్పటికే 55 శాతం గృహాలకు వెళ్లి ప్రజల ఆరోగ్యపై ఆరా తీశారు. కరోనా అనుమానిత లక్షణాలున్నవారిని గుర్తించి వారికి వైద్యపరీక్షలు చేయడంతో పాటు వైద్యసాయం అందిస్తున్నారు.

రెండు వారాలకు ఒక విడత చొప్పున ఫీవర్‌ సర్వే చేపట్టాలని జిల్లాల అధికారులను ఆదేశించినట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు చెప్పుకోదగ్గ స్థాయిలో లేదన్నారు. అనుమానిత లక్షణాలున్నవారిని పరీక్షించినా నెగిటివ్‌గా నిర్ధారణ అవుతోందని చెప్పారు. కేసుల నమోదు లేనప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించాలని విజ్ఞప్తి చేశారు.   

మరిన్ని వార్తలు