ధాన్యం సేకరణకు చురుగ్గా ఏర్పాట్లు 

14 Oct, 2022 06:10 IST|Sakshi

నవంబర్‌ మొదటి వారం నుంచి ప్రారంభానికి కసరత్తు 

క్వింటాకు రూ.100 పెరిగిన మద్దతు ధర 

క్వింటా ఏ–గ్రేడ్‌కు రూ.2,060.. సాధారణ రకానికి రూ.2,040 

ఏ, బీ, సీ క్లస్టర్లుగా ఆర్బీకేల విభజన 

3,423 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 

37 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం 

ప్రభుత్వమే గోనె సంచులు, హమాలీలు, రవాణా సౌకర్యం ఏర్పాటు  

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చురుగ్గా ఏర్పాట్లుచేస్తోంది. ఇందుకు నవంబర్‌ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా కసరత్తు చేస్తోంది. ఇటీవల ప్రభుత్వం వరికి మద్దతు ధరను క్వింటాకు రూ.100 పెంచింది. దీంతో క్వింటా ఏ–గ్రేడ్‌ రకం రూ.2,060, సాధారణ రకం రూ.2,040కు చేరింది. వరి సాగైన విస్తీర్ణం, దిగుబడి అంచనా ప్రకారం 37 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని భావిస్తున్నారు. ఈసారి కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం 10,300 మంది వలంటీర్ల సేవలను వినియోగించుకోనుంది. వీరికి కొనుగోళ్ల సమయంలో నెలకు రూ.1,500 ప్రోత్సాహకం అందించనున్నారు.  

3,423 ఆర్బీకే క్లస్టర్లలో ధాన్యం సేకరణ 
ఈ ఖరీఫ్‌లో 3,423 ఆర్బీకే క్లస్టర్ల ద్వారా ధాన్యం సేకరణకు పౌర సరఫరాల సంస్థ సమాయత్తమవుతోంది. ధాన్యం సేకరణ సామర్థ్యాన్ని బట్టి రెండు, మూడు ఆర్బీకేలను కలిపి ఒక క్లస్టర్‌గా గుర్తిస్తోంది. ఇందులో రెండువేల టన్నులకు పైగా సేకరణ ఉండే క్లస్టర్లను ఏ, 1,000–2,000లోపు ఉంటే బీ.. 1,000లోపు ఉంటే సీ కేటగిరీలుగా విభజించింది. అవకతవకలకు ఆస్కారం లేకుండా వెబ్‌ల్యాండ్, కౌలు రైతులకు ఇచ్చే పంటసాగు హక్కు పత్రాల (సీసీఆర్సీ కార్డులు) ఆధారంగా పక్కాగా 100 శాతం ఈ–క్రాప్‌ నమోదును పూర్తిచేశారు.

వచ్చే 16 నుంచి ఈ–క్రాప్‌ జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. వాటిల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే సవరిస్తారు. ఇక పంట ఉత్పత్తులను తరలించేందుకు అవసరమైన గోనె సంచులు, హమాలీలు, రవాణా సౌకర్యాలను ప్రభుత్వమే అందిస్తోంది.  రైతులే స్వయంగా గోనె సంచులు ఏర్పాటుచేసుకుంటే క్వింటాకు రూ.12.66 ఇవ్వనున్నారు. సొంతంగా ధాన్యాన్ని తరలించే వెసులుబాటునూ కల్పించారు.

ఇందుకైన రవాణా, హమాలీ ఖర్చులు మొత్తాన్ని ధాన్యం విక్రయించిన సొమ్ముతో కలిపి 21 రోజుల్లో రైతు ఖాతాలో జమచేస్తారు. ఆర్బీకే నుంచి మిల్లుకు చేరే ధాన్యం తూకంలో వ్యత్యాసం, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా మిల్లు వద్ద్ద ఒక కస్టోడియన్‌ అధికారిని కూడా నియమించారు.  

దళారులు, మిల్లర్ల అక్రమాలకు చెక్‌ 
అలాగే, ధాన్యం సేకరణలో దళారులు, మిల్లర్ల పాత్రను పూర్తిగా తొలగించేలా సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇప్పటివరకు ఆయా ఆర్బీకేలకు మిల్లులను మ్యాపింగ్‌ చేసేవారు. దీంతో కొనుగోలు చేసిన ధాన్యం ఏ మిల్లుకు వెళ్తుందో ముందుగానే తెలిసిపోయేది. ఈ క్రమంలో కొందరు దళారులు, మిల్లర్లు అక్రమాలకు పాల్పడేవారు. దీనిని అధిగమించేందుకు మిల్లులను జోన్లుగా విభజించారు. చివరి నిమిషంలో మాత్రమే ధాన్యాన్ని ఏ మిల్లుకు తరలించాలో చెప్పేలా ఆటోమేటిక్‌ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టారు.  

పారదర్శకంగా కొనుగోళ్లు 
ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెస్తోంది.  రైతులకు వంద శాతం మద్దతు ధరను అందించేలా పారదర్శక విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నాం. గోనె సంచులు, హమాలీలు, రవాణా వాహనాలను ముందుగా ఏర్పాటుచేయాలని జేసీలకు సూచించాం. ఒకవేళ రైతులే వాటిని ఏర్పాటుచేసుకుంటే ఖర్చులను వారి ఖాతాల్లో జమచేస్తాం.  
– హెచ్‌. అరుణ్‌కుమార్, కమిషనర్, ఏపీ పౌరసరఫరాల శాఖ  

మిల్లుల వద్ద కస్టోడియన్‌ అధికారులు 
ఆర్బీకేల్లో సజావుగా ధాన్యం విక్రయించినప్పటికీ మిల్లర్ల కొర్రీలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, తూకంలో వ్యత్యాసం పేరుతో రైతుల మద్దతు ధరకు కోత పెడుతున్నారు. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం మిల్లుల వద్ద ఒక కస్టోడియన్‌ అధికారిని సైతం నియమించింది. అవకతవకలకు తావులేకుండా ధాన్యం సేకరణలో ప్రతి ప్రక్రియను ఫొటోతీసి అప్‌లోడ్‌ చేస్తారు. 
– వీరపాండియన్, ఎండీ, పౌరసరఫరాల సంస్థ  

మరిన్ని వార్తలు