దశమి నాటికి స్మార్ట్‌ టౌన్‌షిప్‌లపై కార్యాచరణ

2 Sep, 2021 05:20 IST|Sakshi

మధ్య తరగతి కుటుంబాలకు జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌ లేఅవుట్ల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు

భూసేకరణకు మొదలైన సన్నాహాలు

ప్రాథమికంగా 4 వేల ఎకరాలు గుర్తింపు

సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లోని మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో ఇళ్ల స్థలాలు సమకూర్చే ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌’ (మిడిల్‌ ఇన్‌కమ్‌ గ్రూప్‌ లేఅవుట్ల) నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 150, 200, 240 చదరపు గజాలుగా మూడు కేటగిరీల్లో ప్లాట్లను మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వమే సమకూరుస్తుంది. వీటికి మధ్య తరగతి కుటుంబాల నుంచి ఏ మేరకు డిమాండ్‌ ఉందో తెలుసుకునేందుకు సర్వే నిర్వహించగా.. 3.94 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అనువైన భూములను గుర్తించి మునిసిపల్‌ శాఖకు అప్పగించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.

కొనసాగుతున్న గుర్తింపు
ప్రభుత్వ సంస్థలు, శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు, నగర, పురపాలక సంస్థలు ప్రజోపయోగం కోసం గతంలో సేకరించి ఉపయోగించని భూముల్లో ఎంఐజీ లేఅవుట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 124 నగర, పురపాలికలు, నగర పంచాయతీల పరిధిలో భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 4 వేల ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు. లేఅవుట్‌ల ఏర్పాటు, లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను జిల్లా స్థాయి కమిటీలే చేపడతాయి. స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల పథకం కార్యాచరణ, అమలు తేదీలను విజయ దశమి నాటికి ప్రకటించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో విజయదశమి నాటికి కార్యాచరణ ప్రకటించడానికి అధికారులు సిద్ధం అవుతున్నారు.

అన్ని వసతులు
ఈ లేఅవుట్లలో 60 అడుగుల బీటీ, 40 అడుగుల సీసీ రోడ్లతో పాటు ఫుట్‌ పాత్‌లు, నీటి నిల్వ, సరఫరాకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ, ఎలక్ట్రికల్, కేబుల్, వీధి లైట్లు, పార్క్‌లు, గ్రీనరీ మొదలైన అన్ని వసతులు కల్పిస్తారు.  

మరిన్ని వార్తలు