జేసీలే థియేటర్లకు అనుమతులు ఇస్తారు

31 Dec, 2021 03:52 IST|Sakshi

యజమానులు తప్పు తెలుసుకొని అనుమతులు పొందాలి

లైసెన్సు రెన్యువల్, ఇతర అనుమతుల కోసం జాయింట్‌ కలెక్టర్లకు దరఖాస్తు చేయాలి

థియేటర్లకు అన్ని అనుమతులు పొందాలని సెప్టెంబరులోనే చెప్పాం

నిబంధనలు పాటించకపోతే అధికారులు తనిఖీ చేయాలి కదా: మంత్రి పేర్ని నాని

టికెట్ల రేట్లు పెంచుకోవడానికి వ్యతిరేకం: ఆర్‌. నారాయణమూర్తి

సినీ పెద్దలు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం కాదు.. పరిశ్రమ గురించి ఆలోచించాలి  

సాక్షి, అమరావతి/ చిలకలపూడి (మచిలీపట్నం): నిబంధనలు పాటించని సినిమా థియేటర్ల యజమానులు వారి తప్పు తెలుసుకుని లైసెన్స్‌ రెన్యువల్, ఇతర అనుమతుల కోసం జాయింట్‌ కలెక్టర్లకు దరఖాస్తు చేస్తే తదనుగుణంగా చర్యలు తీసుకుంటారని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. సినిమాలు చూసేందుకు వేలాది మంది ప్రేక్షకులు వచ్చే థియేటర్లు నిబంధనలకు అనుగుణంగా ఉండకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం కక్షగట్టి థియేటర్లు మూసేయిస్తోందని విమర్శిస్తున్న వారు ఏదైనా ప్రమాదం జరిగితే మళ్లీ ప్రభుత్వం పైనే బురద జల్లుతారని అన్నారు.

అనుమతుల్లేకుండా థియేటర్లు నడపడం ధర్మమని వారు ఎలా చెబుతారని నిలదీశారు. ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తితో కలసి కృష్ణా జిల్లాకు చెందిన థియేటర్ల యజమానులు పలువురు మంత్రి పేర్ని నానితో మచిలీపట్నంలో గురువారం సమావేశమయ్యారు. అనంతరం మంత్రి పేర్ని నాని, నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు. చట్ట ప్రకారం థియేటర్లపై చర్యలు తీసుకునే అధికారం, సీజ్‌ చేసిన థియేటర్లకు మళ్లీ షరతులతో అనుమతులు ఇచ్చే  అధికారం జాయింట్‌ కలెక్టర్లకే ఉందని మంత్రి స్పష్టంచేశారు.

బీ ఫారం లైసెన్సులు రెన్యువల్‌ చేసుకోవాలని, అగ్నిమాపక శాఖ నిర్దేశిత ప్రమాణాలు పాటించి నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్లు (ఎన్‌వోసీలు), ఇతరత్రా అనుమతులు తీసుకోవాలని థియేటర్ల యజమానులకు సెప్టెంబరులోనే చెప్పామన్నారు. డిసెంబర్‌ ముగుస్తున్నప్పటికీ కొన్ని థియేటర్లు ఆ అనుమతులు పొందేలేదన్నారు. ప్రభుత్వం సానుభూతితో, సానుకూల ధోరణితో వ్యవహరించినప్పటికీ నిబంధనలను పాటించకపోవడం సరికాదని చెప్పారు. అనుమతులు పొందని థియేటర్లలో జాయింట్‌ కలెక్టర్లు తనిఖీలు చేయకుండా ఎలా ఉంటారని మంత్రి ప్రశ్నించారు.

సినిమా టికెట్ల రేట్లు పెంచడానికి వ్యతిరేకం: ఆర్‌. నారాయణమూర్తి 
సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి తాను వ్యతిరేకమని ఆర్‌. నారాయణమూర్తి స్పష్టం చేశారు. టికెట్ల రేట్లు పెంచుకోవడం అధికారిక బ్లాక్‌ మార్కెట్‌ వంటిదేనన్నారు. పేద, బడుగు, బలహీనవర్గాలు, సగటు మనుషులను దృష్టిలో పెట్టుకుని టికెట్ల రేట్లు నిర్ణయించాలని చెప్పారు. సినీ పెద్దలు వ్యక్తిగత అభిప్రాయాలకు పోకుండా పరిశ్రమ మనుగడ కోసం ఆలోచించి ప్రేక్షకులను ఆనందపరచాల్సిన అవసరం ఉందన్నారు. సినిమా తీసేవారు, చూపేవారు, చూసే వారు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుందని అన్నారు. సినీ పెద్దలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు తీసుకువెళ్లి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేయడానికి తాను మంత్రిని కలిసినట్లు తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమ పెద్దలు సమన్వయంతో ముందుకు వెళతారని ఆశిస్తున్నానన్నారు.

చదవండి: (ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు)

మరిన్ని వార్తలు