కాలు జారితే అంతే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..

21 Oct, 2022 19:59 IST|Sakshi

ప్రమాదకర పరిస్థితుల్లో పింజరికొండ గ్రామస్తుల రాకపోకలు

అడ్డతీగల(అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రత్యామ్నాయం లేకపోవడంతో గత్యంతరం లేక అడ్డతీగల మండలంలోని పింజరికొండ గ్రామస్తులు అంత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఏలేరు వాగులో గల గోడపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. 400 మంది జనాభా ఉన్న ఈ గ్రామం వాగుకు అవతలి వైపు ఉంది.  


2010 వరకూ వాగులో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకునే వారు. వాగుకు సమీపంలో చిన్నతరహా జలవిద్యుత్‌ కేంద్రం నిర్మించారు. అక్కడ  విద్యుత్‌ ఉత్పత్తి చేయడం కోసం నీటిని మళ్లించడానికి వాగుకు అడ్డంగా వియర్‌(అడ్డుగోడ) నిర్మించారు. ఇప్పుడా గోడమీద నుంచి పింజరికొండ గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం నీటి ప్రవాహం ఉండడంతో గోడ నాచుపట్టి ఉంటుంది. ప్రవాహ ఉధృతి అధికంగా ఉన్నప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గోడపై నుంచి రాకపోకలు సాగించవలసి వస్తోంది. 


ఈ క్రమంలో ప్రమాదాలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది. పలువురు మృత్యువాత పడ్డారు. వాగు దాటితే గాని  బాహ్యప్రపంచానికి రాలేని పరిస్థితి వారిది. వాగు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో గల  పాపంపేట చేరుకుంటేగాని వారికి వాహన సదుపాయం అందుబాటులోకి రాదు. ఏలేరు వాగుపై  రోప్‌ బ్రిడ్జి అయినా నిర్మించాలని పింజిరికొండ వాసులు సంవత్సరాల తరబడి కోరుతూనే ఉన్నారు. (క్లిక్‌ చేయండి: పాపికొండలు.. షికారుకు సిద్ధం)

మరిన్ని వార్తలు