నాలుగు ముక్కలతో ‘పిల్‌’లా?

1 Aug, 2020 05:49 IST|Sakshi

హైకోర్టును పిటిషనర్లు స్వర్గధామంలా భావిస్తున్నారు 

ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకునేందుకు పిటిషన్లు 

హైకోర్టుకు నివేదించిన అదనపు ఏజీ పొన్నవోలు

సాక్షి, అమరావతి: ప్రజా ప్రయోజనాల పేరుతో ప్రచార వ్యాజ్యాలను దాఖలు చేసే పిటిషనర్లు హైకోర్టును స్వర్గధామంలా భావిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. ఇలాంటి వ్యాజ్యాల ద్వారా వారంతా ప్రభుత్వాన్ని నడపాలని, శాసించాలని ఉబలాటపడుతున్నారని చెప్పారు. ప్రకాశం జిల్లాలో పేదలకు ఇళ్ల పథకం కింద మైనింగ్‌ భూములు కేటాయిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా పొన్నవోలు పలు అంశాలను ప్రధాన న్యాయమూర్తి (సీజే)జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో పేదలకు శాశ్వత గృహ కల్పన లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారని, ప్రస్తుత కేసే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని కోర్టుకు నివేదించారు. వీరి లక్ష్యమంతా ప్రభుత్వాన్ని ఎలాగైనా ప్రజలకు దగ్గర కాకుండా చేయడమేనన్నారు.  

న్యాయస్థానాలను మభ్యపెట్టే యత్నాలు.. 
►ప్రకాశం జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులకు సంబంధించి మక్కెన తిరుపతిస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆయన కుమారుడు మక్కెన శ్రీనివాసులు పిల్‌ దాఖలు చేశారు. తిరుపతిస్వామి పిటిషన్‌లో తన వయసును 50 సంవత్సరాలుగా పేర్కొంటే శ్రీనివాసులు తన వయసును 51 ఏళ్లుగా చూపారన్నారు. అంటే తండ్రి కంటే కుమారుడి వయసే ఎక్కువగా ఉంది. ప్రభుత్వం 30 చట్టాలను ఉల్లంఘించిందని పిల్‌లో పేర్కొన్న పిటిషనర్, ఎలా ఉల్లంఘించిందో మాత్రం ఎక్కడా చెప్పలేదు. 
►ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘించిందంటూ రకరకాల ఆరోపణలుతో నాలుగు ముక్కలు రాసేసి ప్రజా ప్రయోజన వ్యాజ్యం పేరుతో పిటిషన్‌లు వేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడిందో ఒక్క ముక్క కూడా చెప్పడం లేదు.  
►ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న ఏకైక ఎజెండా, జెండాతోనే వీరంతా హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి అసంతృప్త, అరాచక శక్తులను ఆదిలోనే అణచివేయాలి. లేనిపక్షంలో న్యాయవ్యవస్థకు పెనుముప్పుగా మారతారు.  
►దీనిపై అన్ని వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలన్న హైకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది.   

ముందు జీతభత్యాలు నిర్ణయించండి
తర్వాత పోస్టులు నోటిఫై చేయండి
వినియోగదారుల కమిషన్‌ పోస్టుల భర్తీపై హైకోర్టు

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వినియోగదారుల పరిరక్షణ చట్ట నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ చైర్మన్, సభ్యుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ముందు చైర్మన్, సభ్యుల జీతభత్యాలను నిర్ణయించి, అనంతరం పోస్టులను నోటిఫై చేయాలని సూచించింది. ఆ తర్వాతే దరఖాస్తులను ఆహ్వానించి, అంతిమంగా వాటిని సెలక్షన్‌ కమిటీ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నెల పాటు వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. వినియోగదారుల ఫోరంలలో పై పోస్టుల భర్తీకి ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది అజయ్‌కుమార్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌పై ధర్మాసనం విచారణ జరిపింది.

హైకోర్టు తీర్పులను ప్రభుత్వం సంతోషంగా స్వీకరించ లేకపోతోంది
హైకోర్టుకు రిజిస్ట్రార్‌ జనరల్‌ నివేదన
హైకోర్టు ఇచ్చిన వ్యతిరేక తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం సంతోషంగా స్వీకరించలేకపోతోందని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ బీఎస్‌.భానుమతి హైకోర్టుకు నివేదించారు. హైకోర్టులో కోవిడ్‌ను అదుపు చేయడంలో విఫలమయ్యారంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై బీసీ సంఘం అధ్యక్షుడి హోదాలో వి.ఈశ్వరయ్య రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయ మంత్రికి ఫిర్యాదులు చేశారని తెలిపారు. జస్టిస్‌ ఈశ్వరయ్యను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ కమిటీ చైర్మన్‌గా నియమించిందన్నారు. ఇప్పుడు హైకోర్టును రెడ్‌ జోన్‌గా ప్రకటించాలని కోరుతూ పిల్‌ దాఖలు చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ కూడా ఈశ్వరయ్య చేసిన ఆరోపణలనే తన పిటిషన్‌లో పేర్కొందని తెలిపారు. పిల్‌ను విచారణకు తీసుకోవాలా? వద్దా అన్న అంశంపై ఉత్తర్వులిస్తామని ధర్మాసనం వెల్లడించింది.   

మరిన్ని వార్తలు