వెలుగుల మాటున వసూళ్లు! 

29 Oct, 2020 11:01 IST|Sakshi
పాడైపోయిన ఎల్‌ఈడీ దీపాలు

ఎల్‌ఈడీ దీపాల మరమ్మతుల పేరిట అదనపు వసూళ్లు 

ఉచితంగా చేయాల్సిన పనికి రూ. 300ల వంతున వసూలు

18 మండలాల్లోని 463 పంచాయతీల్లో సాగుతున్న తతంగం

కాంట్రాక్టు పొందిన సంస్థ నిర్వాకం 

పంచాయతీల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణకు 2017లో అప్పటి ప్రభుత్వం ఐలెట్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీపాలు ఏర్పాటు చేయించింది. 2021 వరకు దీపాల నిర్వహణ బాధ్యతను సంస్థే చూడాలి. కానీ ఈ నిబంధనను పక్కనపెట్టి పంచాయతీల నుంచి నిర్వహణ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరమ్మతుల పేరిట నిధులు కొల్లగొడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విజయనగరం రూరల్‌: పంచాయతీల్లో ఎల్‌ఈడీ విద్యుత్‌ దీపాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జిల్లాలో 2015లో ఎల్‌ఈడీ ప్రాజెక్టు ప్రారంభం కాగా 2017లో విజయనగరం ఎంపీ ల్యాడ్స్‌ నుంచి ఎల్‌ఈడీ దీపాల కొనుగోళ్లు, నిర్వహణను గంట్యాడ మండలం కరకవలసకు చెందిన ఐలైట్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీకి అప్పగించింది. ఒక్కో ఎల్‌ఈడీ విద్యుత్‌ దీపం కొనుగోలుకు ప్రభుత్వం రూ.999లుగా ధర నిర్ణయించింది. ఎల్‌ఈడీ కొనుగోలుకు ఎంపీ లాడ్స్‌ నుంచి 70 శాతం వాటా, గ్రామ పంచాయతీల నిధుల నుంచి 30 శాతం వాటాను ఐలైట్‌ ఇండియా సంస్థకు చెల్లించింది. జిల్లాలోని 18 మండలాల్లో ఉన్న 463 గ్రామ పంచాయతీల్లో ఎంపీల్యాడ్స్‌ నుంచి 55,974 ఎల్‌ఈడీ బల్బులు కొనుగోలు చేసి పంచాయతీల్లో అమర్చింది. విద్యుత్‌ బల్బుల ఏర్పాటు, ఒప్పందం ప్రకారం 2017 నుంచి 2021 వరకు విద్యుత్‌ దీపాల నిర్వహణ బాధ్యత అంతా సంస్థదే.  

ప్రకృతి వైపరీత్యాల పేరిట డబ్బుల వసూలు..  
విద్యుత్‌ దీపాల నిర్వహణ ఒప్పందం నాలుగేళ్లు. కానీ ఆ సంస్థ ప్రకృతి వైపరీత్యాలను కారణంగా చూపి బల్బులు పూర్తి గా పాడయ్యాయని చెప్పి ఒక్కోదానికి గ్రామ పంచాయతీల నుంచి రూ. 300 చొప్పున వసూలు  చేస్తున్నట్లు అధికారు లు, గ్రామ పంచాయతీ కార్యదర్శుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక మండలంలో ఒక నెలలో 40 బల్బులు పాడయ్యాయి. వాటిని బాగుచేసేందుకు ఆ సంస్థకు అప్పగిస్తే అందులో 20 వరకు పూర్తిగా పాడైపోయాయని, ఒక్కో దానికి రూ.300లు చెల్లించాలని సంస్థ నిర్వాహకులు డిమాండ్‌ చేసినట్టు పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. పాడైపోయిన 20 బల్బులకు డబ్బులు చెల్లించకపోతే మిగిలినవాటిని మరమ్మతు చేయడం లేదని పంచాయతీల  కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పిడుగులు పడినా, చెట్టు కొమ్మలు విరిగిపడి ఎల్‌ఈడీ విద్యుత్‌ దీపాలు పాడైపోతే వాటికి వారంటీ ఇవ్వలేమని, బిల్లులు చెల్లించాల్సిందేనని నిర్వాహకులు చెబుతున్నారని పేర్కొంటున్నారు. వాస్తవంగా పాడైపోయిన దీపాలను నిర్వాహకులకు అప్పగించిన 72 గంటల్లో మరమ్మతులు చేపట్టి అందించాల్సి ఉన్నా వారు స్పందించడంలేదని పంచాయతీ కార్యదర్శులు చెబుతు న్నారు. నాటి టీడీపీ పెద్దల సహకారంతో ఈ కాంట్రాక్టును రూ. 5.50 కోట్లకు దక్కించుకున్న సంస్థ ఇప్పుడు మరమ్మతుల పేరిట అదనంగా వసూలు చేయ డం పంచాయతీలకు భారమేనని పేర్కొంటున్నారు. దీనిపై ఓ ఎంపీడీఓ ఉన్నతాధికారులకు లేఖ రాయడంతో హడావుడిగా సమావేశం ఏర్పాటు చేసి ఐలైట్‌ సంస్థ నిర్వాహకులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. 

షోకాజ్‌ నోటీసు జారీచేశాం 
ఎల్‌ఈడీ విద్యుత్‌ దీపాలు పాడైపోతే 72 గంటల్లో వాటికి మరమ్మతు చేయాల్సి ఉన్నా సంస్థ నిర్వాహ కులు సకాలంలో వాటిని అందించలేదని మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శుల నుంచి వస్తు న్న ఫిర్యాదుల ఆధారంగా షోకాజ్‌ నోటీసు జారీ చేశాం. ఇటీవల ఈ విషయంపై అధికారులు, ఐలైట్‌ సంస్థ నిర్వాహకులతో సమావేశం నిర్వహించాం. సంస్థ నిర్వాహకులు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పూర్తిగా పాడైపోయిన బల్బులకు వారంటీ లేదని చెప్పారు. వారంటీ లేనివాటికి మరమ్మతులు చేపట్టలేమని చెప్పారు.  
– కె.సునీల్‌ రాజ్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి

కరోనాయే కారణం 
కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల ఏడు నెలలుగా పాడైపోయిన ఎల్‌ఈడీ దీపాలు బాగుచేయ డంలో ఆలస్యమైంది. మా దగ్గరకు వచ్చిన 455 బల్బులకు 276 బల్బులు బాగుచేశాం. కేవలం 179 విద్యుత్‌ దీపాలను మరమ్మతు చేపట్టడంలో ఆలస్యమైంది. వారంటీలో లేని విద్యుత్‌ దీపాలు పూర్తిగా చెడిపోతే కొత్తవి కావాలని అధికారులు అడిగితే వాటిని విక్ర యిస్తున్నాం. మరమ్మతుల పేరిట అదనపు వసూలు చేయడం లేదు.  
– కళ్యాణ్, ఐలైట్‌ సంస్థ ,నిర్వాహకుడు  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా