ఆర్కేవీవై కింద రాష్ట్రానికి అదనంగా రూ.223 కోట్లు

28 Mar, 2021 05:42 IST|Sakshi

సాక్షి, అమరావతి: వ్యవసాయ అనుబంధ రంగాల బలోపేతానికి రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన(ఆర్కేవీవై) కింద తాజాగా రూ.223 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఆర్కేవీవై కింద ఏటా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులకు ఇవి అదనం. రైతుల ఆదాయం పెంచేందుకు అవసరమైన సాగు ఉత్పాదకతలను పెంపొందించే లక్ష్యంతో 60:40 నిష్పత్తిలో కేంద్రం ఆర్కేవీఐ కింద రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తుంది. ఈ పథకం కింద 2020–2021 ఆర్థిక సంవత్సరానికి రూ.298 కోట్లను మంజూరు చేసింది. అందులో తన వాటా కింద కేంద్రం రూ.164 కోట్లు విడుదల చేయగా.. వాటికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను జతచేసి ఆర్బీకేల్లో అదనపు సౌకర్యాలకోసం ఖర్చుచేసింది.

ఈ నేపథ్యంలో రైతులకోసం ఆర్బీకేలకు అనుబంధంగా నియోజకవర్గ స్థాయిలో అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు తీసుకొస్తున్నామని, కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లనూ ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం ఆర్కేవీవై కింద అదనంగా మరో రూ.242 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్రప్రభుత్వం అభ్యర్థించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం రూ.223 కోట్లు అదనంగా ఖర్చు చేసేందుకు ఆదేశాలిచ్చింది. అందులో తన వాటాగా రూ.134 కోట్లను విడుదల చేస్తూ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ శనివారం ఉత్తర్వులిచ్చింది. ఈ నిధులతో అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ల్లో పరికరాలు కొనుగోలు  చేయనున్నారు.   

మరిన్ని వార్తలు