విద్యారంగంపై రూ.లక్ష కోట్లు ఖర్చు చేశాం 

9 Jan, 2022 03:53 IST|Sakshi

విద్యారంగాన్ని సంస్కరించేందుకే పాఠశాలల విలీనం, సీబీఎస్‌ఈ సిలబస్‌  

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ 

గుంటూరు ఎడ్యుకేషన్‌: వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక 31 నెలల వ్యవధిలో విద్యారంగంపై రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి సురేష్‌ మాట్లాడుతూ అసమానతలకు తావు లేని సమాజాన్ని నిర్మించడంలో విద్య కీలకపాత్ర పోషిస్తుందని గాఢంగా నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాలకు పైసా ఖర్చు లేని ఉచిత విద్య అందించేలా లోటు లేకుండా నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు.  

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోటీ ప్రపంచానికి తగినట్లుగా భాష, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే ఉద్దేశంతో అనేక సంస్కరణలను తీసుకొచ్చామన్నారు. నాడు–నేడు, ప్రాథమిక పాఠశాలల విలీనం, జగనన్న విద్యా కానుక, ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్, కరిక్యులమ్‌లో మార్పులు ఇందులో భాగంగా ప్రవేశపెట్టినవేనన్నారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను అభివృద్ధి చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేలా ముఖ్యమంత్రి స్వేచ్ఛ ఇచ్చారని, దానిని సద్వినియోగం చేసుకుంటున్నామని అన్నారు. ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కేఎస్‌ లక్ష్మణరావు, సీసీఎంబీ పూర్వ డైరెక్టర్‌ డాక్టర్‌ సీహెచ్‌ మోహనరావు, జనవిజ్ఞాన వేదిక అధ్యక్షులు రాహుల్, కోయ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు