మే నెలాఖరుకు 40 వేల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం: ఆదిమూలపు సురేశ్‌

29 Apr, 2022 09:03 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: అర్హులైన పేదలకు కేవలం ఒక్క రూపాయి రిజిస్ట్రేషన్‌తో మే నెలాఖరు నాటికి 40 వేల టిడ్కో ఇళ్లు పూర్తి చేసి అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నామని మునిసిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న టిడ్కో ఇళ్ల పనుల పురోగతిపై విశాఖలోని వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎల్లో మీడియా అసత్యాల్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండటం హేయమన్నారు. 

గత ప్రభుత్వం 5 లక్షల టిడ్కో ఇళ్లను కట్టిస్తామని చెప్పి టెండర్ల దశలో 4,54,706కి కుదించి.. గ్రౌండింగ్‌ సమయానికి 3,13,832కు తగ్గించిందన్నారు. 2019 ఎన్నికల సమయంలో 90 శాతం ఇళ్లు పూర్తయిపోయాయంటూ అబద్ధపు ప్రచారాలు చేశారనీ, తాము అధికారంలోకి వచ్చాక క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 1.22 లక్షల ఇళ్లు బేస్‌మెంట్, దానికంటే కింద స్థాయిలో ఉన్నాయనీ, 81 వేల ఇళ్లు 90 శాతం పూర్తయినా అందులో కేవలం 10 శాతం ఇళ్లకు కూడా కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని స్పష్టం చేశారు.

ఐదేళ్ల కాలంలో ఒక్క టిడ్కో ఇల్లయినా చంద్రబాబు లబ్ధిదారులకు అందించారా అని ప్రశ్నించారు. డిమాండ్‌ లేని ప్రాంతాల్లో నిర్మించదలచిన 51,616 ఇళ్లని రద్దు చేశామని, మొత్తంగా 2,62,216 టిడ్కో ఇళ్లని నిర్మించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. డిసెంబర్‌ నాటికల్లా అన్ని ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని చెప్పారు. సమీక్షలో టిడ్కో చైర్మన్‌ ప్రసన్నకుమార్, టిడ్కో ఎండీ శ్రీధర్, జీవీఎంసీ కమిషనర్‌ డా.లక్ష్మీశ, టిడ్కో చీఫ్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వరరావు తదితరులు 
పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు