మొదటి నెల రోజులు హాఫ్‌ డే స్కూళ్లు

23 Oct, 2020 07:57 IST|Sakshi

విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్కూళ్లను నవంబర్‌ 2 నుంచి ప్రారంభించనుండడంతో విద్యార్థుల చదువులతోపాటు వారి ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పారు. ఆయన గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ నవంబర్‌ 2న స్కూళ్లు తెరిచాక నెలపాటు హాఫ్‌ డే స్కూళ్లు నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్‌ నుంచి రక్షణకు చర్యలు, ఆరోగ్య పరిరక్షణపై విద్యార్థులకు రోజూ 15 నిమిషాలపాటు టీచర్లు బోధిస్తారని వెల్లడించారు. స్కూళ్లను శానిటైజ్‌ చేయించడంతోపాటు శానిటైజర్లను అందుబాటులో ఉంచుతామని వివరించారు. సంక్రాంతి, వేసవికి సెలవు రోజులను తగ్గించి స్కూళ్లు నిర్వహిస్తామని చెప్పారు. సెలవు రోజుల్లో విద్యార్థులకు లెర్నింగ్‌ హవర్స్‌ను కేటాయించి వారు ఇంటి దగ్గరే ఉండి నేర్చుకునేలా పలు రకాల చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: గ్రామ సచివాలయ వ్యవస్థ సూపర్‌  

డిసెంబర్‌ ఒకటి నుంచి ఇంజనీరింగ్‌ తదితర యూజీ కోర్సుల ఫస్టియర్‌ తరగతులు, నవంబర్‌ 2 నుంచి ఇతర ఏడాదుల్లోని విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తామన్నారు. కాగా, ‘మన బడి: నాడు–నేడు’ పనులను త్వరగా పూర్తి చేయాలని  ఆదేశించారు. గురువారం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ‘మన బడి: నాడు– నేడు’పై ఆయన సమీక్ష నిర్వహించారు. 9, 10 తరగతుల్లో విద్యార్థుల సౌకర్యార్థం డ్యూయెల్‌ డెస్కులను మరింత పెద్దవి ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. డ్యూయెల్‌ డెస్కులు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ఇతర ఫర్నీచర్‌ వస్తువులు త్వరగా పాఠశాలలకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య సలహాదారు ఎ.మురళి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లాల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. చదవండి:  ‘కోవాక్సీన్‌’ బిహార్‌ కోసమేనట! 

మరిన్ని వార్తలు