సమర్థంగా పట్టణ భూ రీ సర్వే 

11 Aug, 2022 04:15 IST|Sakshi

దేశంలో అత్యుత్తమ పాలన సంస్కరణలకు సీఎం జగన్‌ శ్రీకారం 

ఎంతో కాలంగా ఉన్న ఆస్తి సమస్యలకు సర్వేతో పరిష్కారం 

మునిసిపల్‌ శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ 

సాక్షి, అమరావతి: దేశంలోనే అత్యుత్తమ పరిపాలనా సంస్కరణలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకారం చుట్టారని, అందులో వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు – భూరక్ష పథకం ఒకటని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. వందేళ్ల తర్వాత పట్టణ ప్రాంతాల్లో అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఈ బృహత్తర సర్వేను అధికారులు సమర్థంగా పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లు, ఇతర సిబ్బందికి పట్టణ భూ రీ సర్వే, శాశ్వత హక్కుపై అవగాహన సదస్సు బుధవారం విజయవాడలో నిర్వహించారు. డీటీసీపీ విద్యుల్లత, సీసీఎల్‌ఏ అదనపు కమిషనర్‌ అహ్మద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. ఈ సర్వే ద్వారా ఎంతో కాలంగా ఉన్న భూ, ఆస్తి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఎవరి ఆస్తులు ఏ సర్వే నంబర్‌లో ఉన్నాయో పక్కాగా తెలుసుకోవడంతోపాటు హక్కుపత్రం కూడా పొందుతారని తెలిపారు. ప్రస్తుతం మాస్టర్‌ ప్లాన్‌లో ఒకటి ఉంటే.. వాస్తవంగా మరొకటి ఉంటుందని, ఒకరి స్థలం మరొకరి పేరుతో ఉన్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయన్నారు. రీ సర్వే తర్వాత ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.140 కోట్లతో పట్టణ భూ సర్వే ప్రాజెక్టు చేపట్టిందని, ఈ చారిత్రక ఘట్టంలో మున్సిపల్‌ అధికారులు భాగమవ్వాలని పిలుపునిచ్చారు.

పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది ఆరు నెలలపాటు పట్టణ భూ సర్వేకు పనిచేయాలన్నారు. మొదట సమర్థులైన వారిని మాస్టర్‌ ట్రైనర్లుగా ఎంపిక చేసి రాష్ట్ర కార్యాలయానికి పంపాలని, వారికి సామర్లకోటలోని ఏపీ సర్వే అకాడమీలో శిక్షణనిస్తామని చెప్పారు. వీరి ద్వారా యూఎల్బీల్లో అవసరమైనంత మంది సిబ్బందికి శిక్షణనిచ్చి పని ప్రారంభించాలని సూచించారు. 

సచివాలయాల సిబ్బంది, ప్రజలను భాగస్వాములను చేయాలి 
నగర, పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్ను వసూలు చేస్తున్నప్పటికీ, ఆ ఆస్తుల యాజమాన్యాలపై దృష్టి పెట్టలేదని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్, కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. టాక్స్‌ అసెస్‌మెంట్‌ నంబర్లున్న ఆస్తులు ఏ సర్వే నంబర్‌లో ఉన్నాయో అధికారులకు కూడా అవగాహన లేదన్నారు. తొలుత స్థానికంగా సమావేశాలు నిర్వహించాలని, ఇందులో వార్డు సచివాలయాల సిబ్బందిని, ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. రెవెన్యూ రికార్డు ప్రకారం ఆస్తికి సంబంధించి అన్ని అంశాలపై సర్వే చేయాలని తెలిపారు. అనంతరం డ్రోన్‌ ఆధారంగా ఆస్తులను సర్వే చేయడంపై అవగాహన కల్పించారు.   

మరిన్ని వార్తలు