వర్సిటీలు బహుశాస్త్ర మిశ్రిత కేంద్రాలుగా అవతరించాలి

19 Sep, 2021 04:15 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

పేటెంట్‌లు సాధించడంపై శ్రద్ధ అవసరం

ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌ రాంగోపాల్‌రావు

విద్యార్థుల్ని ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దాలి: మంత్రి ఆదిమూలపు

దొండపర్తి (విశాఖ దక్షిణ): ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు బహుశాస్త్ర మిశ్రిత కేంద్రాలు (మల్టీ డిసిప్లీనరీ) అవతరించాల్సిన అవసరం ఉందని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌ ఆచార్య రాంగోపాలరావు పేర్కొన్నారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా ప్రణాళిక బోర్డు (ఏపీ హెచ్‌ఈపీబీ) రెండో సమావేశం శనివారం విశాఖలో జరిగింది. ఆంధ్రా యూనివర్సిటీ, ఐఐఎం విశాఖపట్నం, ఐఐపీఈ సంయుక్తంగా ఈ సమావేశానికి ఆతిథ్యమిచ్చాయి. ముఖ్య అతిథిగా వర్చువల్‌ విధానం ద్వారా పాల్గొన్న ఆచార్య రాంగోపాలరావు మాట్లాడుతూ.. జ్ఞానాన్ని సంపదగా మలచుకునే ప్రయత్నం జరగాలని చెప్పారు. పేటెంట్‌లకు దరఖాస్తు చేయడం, అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుదల లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. విశ్వవిద్యాలయాల అచార్యులే స్టార్టప్‌లను ఆరంభించే విధంగా నూతన విధానాలను అమలు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. విద్యను అందించడం, జ్ఞానాన్ని వృద్ధి చేయడం, ఆవిష్కరణలు జరపడం లక్ష్యంగా యూనివర్సిటీలు పనిచేయాలన్నారు. 

ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దాలి
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని ప్రపంచ పౌరునిగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. విద్య వ్యాపారం కాకూడదన్న ఉద్దేశంతో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. పేదరికం విద్యకు అవరోధంగా మారకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. త్వరలో విశ్వవిద్యాలయాల ఉప కులపతుల ప్రగతిని సైతం సమీక్షిస్తామన్నారు. విద్యార్థులు సాధించే ప్రగతే విశ్వవిద్యాలయానికి కొలమానంగా మారుతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్ర పర్యాటక, క్రీడా శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యను సామాన్యులకు చేరువ చేస్తున్న వ్యక్తిగా ముఖ్యమంత్రి నిలిచిపోతారని పేర్కొన్నారు.

సీఎం క్రీడలకు అధిక ప్రోత్సాహం కల్పిస్తూ గత రెండేళ్లలో రూ.6.50 కోట్లను వైఎస్సార్‌ క్రీడా ప్రోత్సాహకాల కింద అందించారని తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ ఏపీ స్టేట్‌ రీసెర్చ్‌ బోర్డు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, 13 వేల గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటు, డిగ్రీలో ఆంగ్ల మాధ్యమం, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ ట్యుటోరియల్స్, ఇ–కంటెంట్‌ అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, బ్లెండెడ్‌ లెర్నింగ్‌ను సమర్థవంతంగా అమలు చేయడం వంటి నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఏపీ కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి, ఐఐఎం విశాఖ డైరెక్టర్‌ ఆచార్య చంద్రశేఖర్, ఐఐపీఈ డైరెక్టర్‌ ఆచార్య వీఎస్‌ఆర్‌కే కె.ప్రసాద్‌ మాట్లాడారు. ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్లు ఆచార్య కె.రామమోహన్‌రావు, ఆచార్య టి.లక్ష్మమ్మ, కార్యదర్శి ఆచార్య బి.సుధీర్‌ ప్రేమ్‌కుమార్, ఏయూ డీన్‌లు ఆచార్య కె.రమాసుధ, ఆచార్య టి.షారోన్, రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల ఉపకులపతులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు