ఆ మూడు రంగాలకూ రుణాలివ్వండి

16 Mar, 2021 04:18 IST|Sakshi

ప్రజల ఆరోగ్య సంరక్షణకు రూ.2 వేల కోట్లు అవసరం 

ఓడ రేవులు, విద్యుత్‌ రంగాలకూ నిధులు సమకూర్చండి 

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీని కోరిన సీఎస్‌ 

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ, విద్యుత్‌ రంగం, ఓడరేవుల అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణకు బ్యాంకర్లు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ కోరారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.రాజ్‌కిరణ్‌రాయ్‌తో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆదిత్యనాథ్‌దాస్‌ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించడం కోసం బోధనాస్పత్రులతో పాటు ఆరోగ్య సంరక్షణ రంగంలో కొత్త వైద్య కళాశాలల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. ఆరోగ్య రంగానికి రూ.2 వేల కోట్ల రుణ సదుపాయం అవసరమని, ఇందుకు సహకరించాలని బ్యాంక్‌ ఎండీని కోరారు.

2023 నాటికి రాష్ట్రంలో మూడు పంక్షనల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ నౌకాశ్రయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో గ్రీన్‌ ఫీల్డ్‌ నౌకాశ్రయాల అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. విద్యుత్‌ రంగంలో చేపట్టిన కార్యక్రమాలకు కూడా రుణ సదుపాయం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యూబీఐ ఎండీ రాజ్‌కిరణ్‌రాయ్‌ మాట్లాడుతూ ఈ విషయాల్లో ప్రభుత్వానికి అన్నివిధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (ఆర్థిక–ఇంధన) డి.కృష్ణ, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌సింఘాల్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్, ఏపీ మారిటైమ్‌ బోర్డు సీఈవో రామకృష్ణారెడ్డి, ఏపీ ఎంఐఎస్‌ఐడీసీ ఎండీ విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు